విద్యార్థులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్‌ పరిక్షల ఫలితాలు రానే వచ్చేశాయ్.  ఈ ఏడాది ఇంటర్‌ విద్యార్ధులు రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత సాధించారు. ఏటా మాదిరిగానే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత శాతంతో తమ సత్తా ఏంటో చూపించారు. కొమరం భీం జిల్లా ఫస్ట్ రాగా.. కరోనా కారణంగా అడ్వన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించలేదు విద్యాశాఖ. 


 
తెలంగాణలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటి సారి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఇంత పర్సెంట్ పాస్ కాలేదు. 

 

ద్వితీయ సంవత్సరంలో 68.86 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2 లక్షల 83 వేల 462 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఏ గ్రేడ్ అంటే 75 శాతం కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు లక్షా 67 వేల 942 మంది ఉన్నారు. B గ్రేడ్ సాధించిన వాళ్లు 80 వేల 96 మంది ఉన్నారు. ఇంటర్ ఫలితాల్లో బాలురతో పోల్చుకుంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం లో 60శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో కొమురం భీం జిల్లా ఫస్ట్ ప్లేస్‌ సంపాదించుకుంది.

 

ఫలితాలు సాధించిన విద్యార్ధుల మార్క్స్ లిస్ట్ ఈ నెల 22న కళాశాలకు చేరుకుంటాయ్‌. ఫలితాల్లో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ఏమైనా అనుమానాలుంటే.. టి కౌంటింగ్, రి వాల్యుయేషన్ పెట్టుకోవచ్చని తెలిపారు మంత్రి సబితా. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా ఫలితాలు ప్రకటించామని అన్నారామె. అడ్వాన్స్ సప్లిమెంటరీ తేదీలను తరవాత ప్రకటిస్తామని చెప్పారు. 

 

ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మస్థైర్యం ఉండాలని, ఫెయిల్ అయింది ఒక సబ్జెక్టు లోనేనని జీవితంలో కాదని తెలిపారు మంత్రి. తల్లిదండ్రులు కూడా వారిపై ఒత్తిడి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఫలితాల వల్ల విద్యార్థులు ఏమైనా మానసిక ఇబ్బందులకు గురికాకుండా ఇంటర్ బోర్డు ఏడుగురు మానసిక నిపుణులను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఇబ్బంది పడితే వారితో మాట్లాడాలని మంత్రి సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: