రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ సిద్దమైంది. గెలుపునకు అవసరమైన బలం లేకపోయినా ప్రతిపక్షం బరిలో నిలిచింది. అధికార పార్టీనుంచి నలుగురు సభ్యులు పోటీలో ఉండగా, టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలకు కూడా విప్ ఇచ్చిన టీడీపీ ఒత్తిడి రాజకీయం చేస్తోంది. 

 

ఏపిలో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. నలుగురు సభ్యులు గెలిచేందుకు అవకాశం ఉన్న సందర్భంలో ఐదుగురు పోటీలో నిలిచారు. అధికార పార్టీ నుంచి నలుగురు పోటీ చేస్తుండగా.. టీడీపీ కూడా అభ్యర్థిని బరిలో నిలిపి పోటీకి తెరలేపింది. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. రేపు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అసెంబ్లీ వర్గాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. వాస్తవంగా టిడిపికి రాజ్యసభ సభ్యుని ఎన్నికకు అవసరం అయ్యే బలం శాసనసభలో లేదు. అయినప్పటికీ రాజకీయ వ్యూహంలో భాగంగా వర్ల రామయ్యను పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించింది.

 

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. 23మంది సభ్యులు ఉన్న టీడీపీలో ముగ్గురు సభ్యులు పార్టీని వీడి వెళ్లారు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా విప్‌ను పాటించి వర్ల రామయ్యకు ఓటు వెయ్యాల్సి ఉంటుంది. పార్టీతో విభేదించినా... విప్ ఉంది కాబట్టి పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యక తప్పని పరిస్థితి ఉంటుందని టీడీపీ చెబుతోంది. పార్టీ వీడిన సభ్యులను ఇబ్బంది పెట్టేందుకే విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ముగ్గురు సభ్యులు విప్ ఉల్లంఘిస్తే చర్యలకు డిమాండ్ చేసే అవకాశం టీడీపీకి ఉంటుంది. మరి ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అనేది ఆసక్తికరం. 

 

వర్ల రామయ్యకు పోలింగ్‌లో ఏజెంట్‌గా ఎమ్మెల్సీ ఆశోక్ బాబు ఉంటున్నారు. పార్టీ ఏజెంట్ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉంటారు. ఓటింగ్‌లో పాల్గొనే ఎమ్మెల్యేలు ఏజెంట్‌కు చూపించి తమ ఓటు పోల్ చెయ్యాలి అనే నిబంధన ఉందని టీడీపీ చెబుతోంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో కూడా సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందనే వాదనా ఉంది. దీంతో ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే ఎటు ఓటు వేస్తారు... పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం.

మరింత సమాచారం తెలుసుకోండి: