ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు బాగా పేలుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ జోరు మరికాస్త పెరిగింది. ఏపీలో టీడీపీ నేతలను కేసుల పేరిట ప్రభుత్వం వేధిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గవర్నర్ ను కలిశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షనేత చంద్రబాబు దుర్యోధనుడి పాత్రలో అయ్యన్నపాత్రుడి లాంటి దుశ్యాసనులను ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

 

 

 

అసలు అయ్యన్న పాత్రుడిపై ఎందుకు కేసు నమోదైందనేది అవగాహన ఉండి మాట్లాడుతున్నారా..? అని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. మున్సిపల్‌ మహిళా కమిషనర్‌ను ఉద్దేశించి.. చెప్పిన పనిచేయకపోతే బట్టలు ఊడదీసి నిలబెడతానని మాట్లాడిన అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయకుండా వదిలేయాలా..? అని కడిగేశారు. అయ్యన్నపాత్రుడి అరెస్టుపై చంద్రబాబు లేఖ రాయడం, ఆయన కొడుకు లోకేష్‌కు పోస్టులు పెట్టడాన్ని అమర్ నాథ్ తప్పుబట్టారు.

 

 

మహిళా అధికారిణి పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని మతిభ్రమించి తండ్రీకొడుకులకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ నేతలకు తలకెక్కిన అధికార మదం దిగలేదని, అందుకే మహిళలపై ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో మహిళలపై విపరీతమైన దాడులు జరిగాయని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ గుర్తు చేశారు.

 

 

రిషితేశ్వరి ఘటన దగ్గర నుంచి మహిళా ఎమ్మార్వో వనజాక్షి వరకు చంద్రబాబు అరాచకాలకు సాక్షులని అన్నారు అమర్ నాథ్. విజయవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో హస్తం ఉన్న టీడీపీ నేతలను కాపాడేందుకు గతంలో చంద్రబాబు ప్రయత్నాలు చేయడాన్ని చూశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రోజాను ఎదుర్కోలేక పోలీసులతో అక్రమ అరెస్టు చేయించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని ఊర్లు తిప్పి హింసించాడని గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: