ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. సిబ్బంది అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు . ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియ ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది. రిటర్నింగ్ అధికారి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. 
 
రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ నుంచి నలుగురు బరిలో నిలవగా టీడీపీ నుంచి ఒక్కరు బరిలో నిలిచారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామిక వేత్త, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి, గుజరాత్ కు చెందిన అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీ ఎన్నికల బరిలో ఉన్నారు. వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించింది. 
 
ఒక్కొక్క స్థానానికి కనీసం 34 మంది ఎమ్మెల్యేలను వైసీపీ కేటాయించింది. వైసీపీ ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ఎమ్మెల్యేలకు తెలిపింది. వైసీపీ నలుగురు అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని బలంగా విశ్వసిస్తోంది. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. టీడీపీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. 
 
సభ్యులంతా ఓటింగ్‍లో పాల్గొనాలని.... ప్రతి ఒక్కరూ ఏజెంట్‍కు చూపించి ఓటు వేయాలని చంద్రబాబు నిబంధనలు పెట్టారు. విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే స్పీకర్‌తో అనర్హత వేటు వేయించే దిశగా అడుగులు వేయొచ్చని సమాచారం. అందువల్లే టీడీపీ విప్ జారీ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేలు విప్ కు వ్యతిరేకంగా ఓటు చేసినా ఏపీ స్పీకర్ వారిపై చర్యలు తీసుకుంటారా....? అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.                        

మరింత సమాచారం తెలుసుకోండి: