వల్లభనేని వంశీ... ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. దివంగత పరిటాల రవి అనుచరుడుగా రాజకీయాల్లోకి వచ్చిన వంశీ... టీడీపీలో ఓ ముఖ్యనేతగా ఎదిగారు. పార్టీలోకి రావడమే 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి, లగడపాటి రాజగోపాల్‌పై స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత వంశీ టీడీపీలోనే కొనసాగుతూ...ఒకానొక సమయంలో జగన్ విజయవాడకు వచ్చిన సందర్భంలో ఆయన్ని రోడ్డు మీద ఆలింగనం చేసుకుని సంచలనం సృష్టించారు.

 

ఇక అప్పుడే వంశీ..తన సన్నిహితుడు కొడాలి నాని మాదిరిగానే వైసీపీలోకి వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ వంశీ పార్టీ మారకుండా టీడీపీలోనే ఉంటూ.. 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉండటంతో బాగానే పనిచేసుకున్నారు. బాబుకు విధేయుడుగా నడుచుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ అధికారం కోల్పోవడంతో వంశీ ఆలోచన మారింది. పైగా వంశీపై నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే కేసు రావడంతో, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాని బాబుకు వాట్సాప్ మెసేజ్ చేశారు.

 

దీనికి స్పందనగా బాబు కూడా వంశీకు ధైర్యం చెప్పారు. కానీ ఏమైందో ఏమో గానీ సడన్ గా వంశీ ఎమ్మెల్యే పదవి పోకుండా, వైసీపీలోకి వెళ్లకుండా జగన్‌కు జై కొట్టారు. ఇక అలా చేసిన దగ్గర నుంచి వంశీ...బాబు, లోకేష్‌ని ఏకి పారేస్తున్నారు. అయితే వంశీ ఇలా చేస్తూనే, బాబుకు మంచి కూడా చెబుతున్నారు. తాజాగా కూడా రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చి... చంద్రబాబుని నాలుగు తిట్లు తిట్టి... ఎంతో చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంత దయనీయమైన పరిస్థితికి వస్తుందని అనుకోలేదని, చంద్రబాబు ఇప్పటికైనా తన వద్ద ఉన్న చెంచాలను పక్కన పెట్టాలని సూచించారు.

 

అయితే వంశీ తిట్టినా సరే టీడీపీ మీద ప్రేమ ఉన్నట్లే మాట్లాడారు. తాను 10 ఏళ్ళకు పైనే గడిపిన పార్టీ ఇలా అయిపోవడం ఏంటని బాధపడినట్లు కనిపిస్తోంది. అలాగే బాబు పక్క ఉన్న భజన బృందాన్ని పక్కనపెడితే పార్టీకి బాగుంటుందని ఓ మంచి మాట చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: