ఏపీలో జరిగిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో అధికార వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని విజయం సాధించారు. రాజ్య‌స‌భ‌లో వైఎస్ఆర్‌సీపీ ప్ర‌స్థానం ఒకరితో ప్రారంభమై ఆరుగురికి చేరింది. 2024 నాటికి రాజ్యసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు ఉండ‌నున్నారు. త‌ద్వారా, జ‌గ‌న్ స‌త్తా దేశం గుర్తించ‌నుంది.

 

రాజ్యసభ సభ్యుల ఎన్నిక పోలింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగింది. ఐదు గంటలకు ఓట్లు లెక్కించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించినట్లు కౌంటింగ్ ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఎన్నికయ్యారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలుపొందిన అభ్యర్ధులకు ఒక్కొక్కరికి 38 ఓట్లు వచ్చాయి. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోల్ అయ్యాయి. 

 

వైఎస్ఆర్‌సీపీ అధినేత‌, ఏపీ సీఎం  జగన్ మోహన్ రెడ్డి ఆశయాల మేరకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విధివిధానాల మేరకు రాజ్యసభలో మొదట ప్రస్థానం ఒకరి నుంచి ప్రారంభమై, తర్వాత రెండై ఈరోజు ఆరు స్థానాలు గెలిచింద‌ని ఎంపీ వి.విజయసాయి రెడ్డి తెలిపారు. జగన్ నాయకత్వంలో 2024 నాటికి ఈ ఆరు స్థానాల నుంచి 11కు చేరుకుంటాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో 30 మంది సభ్యులు పైబడి ఉంటే ఆ పార్టీకి కేంద్రంలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. లోక్‌సభలో, రాజ్యసభలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అందరం నాయకుడి ఆశయాలకు, పార్టీ విధివిధానాలకు అనుగుణంగా కలిసి పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని విజయసాయిరెడ్డి తెలియజేశారు. రాజ్యసభకు మరో నలుగురిని పంపించినందుకు సీఎం, ఎమ్మెల్యేలకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: