పులివెందుల.. జగన్ సొంత నియోజకవర్గం.. జగన్ కే కాదు.. వైఎస్ కుటుంబానికి అది పెట్టని కోట. అక్కడి నుంచే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ తో పాటు వైఎస్ కుటుంబీకులు అసెంబ్లీకి వెళ్లారు. దశాబ్దాల తరబడి అక్కడ వైఎస్ కుటుంబం తప్ప వేరెవరకూ గెలవలేదు. అలాంటి తన సొంత నియోజక వర్గం అభివృద్ధిపై జగన్ దృష్టి సారించారు.

 

 

తరచూ పులివెందుల అభివృద్ధి కోసం సమీక్షలు నిర్వహిస్తుంటారు జగన్. తాజాగా పులివెందులలోని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైఫ్‌ స్టాక్‌.. ఏపీ కార్ల్‌ లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు జగన్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఐజీవై సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో దీన్ని చేపడతారు. ఈ ప్రాజెక్టులో పశువులకు కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లు తయారు చేస్తారు. ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో ఈ ఒప్పందంపై ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీని ప్రారంభిస్తారు.

 

 

గొర్రెలకు సహజంగా సోకే చిటెక వ్యాధి, బొబ్బర్ల రోగం, పీపీఆర్‌, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా, తదితర వ్యాధులకు వ్యాక్సిన్లు ఇక్కడ తయారు చేయనున్నారు. ఐజీవై సంస్థ ఇందులో రూ.50 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ప్రభుత్వం తరపున అవసరమైన సదుపాయాలు అధికారులు కల్పిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా 100 మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి లభిస్తుంది.

 

 

దీని ద్వారా.. అంటే.. పులివెందుల ఏపీ కార్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా ప్రపంచ స్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందనే చెప్పాలి. మన పశువులకు కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లు తయారుచేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: