ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి సీఎం జగన్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ 25 మంది ఐదు సంవత్సరాలు పదవుల్లో కొనసాగుతారా అంటే? లేదనే ముందే జగన్ చెప్పేశారు. మంత్రి వర్గం ఏర్పాటు చేసే రోజే..రెండున్నర ఏళ్లలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని జగన్ మొదట్లోనే చెప్పారు. అయితే రెండున్నర ఏళ్ల తర్వాత కూడా పదవులు నిలుపుకోవాలనే ఉద్దేశంతో 25 మంత్రులు బాగానే కష్టపడి పనిచేస్తున్నారు.

 

అయితే ఈ ఏడాది కాలంలో అందరి పనితీరు బాగుందా? అంటే లేదనే చెప్పాలి. ఇంకా చాలా మంది తమ శాఖలపై పట్టు తెచ్చుకోలేదు. ఇంకా సీఎం జగనే వాళ్ళని నడిపించాల్సి వస్తుంది. మరికొందరు దూకుడుగా పనిచేయడం గానీ, ప్రత్యర్ధి టీడీపీకి చెక్ పెట్టడంలో గానీ వెనుకపడి ఉన్నారు. అసలు కొందరు మంత్రులన్న సంగతి చాలమందికి ప్రజలకు తెలియదు. కానీ సీనియర్ మంత్రులని పక్కనబెడితే...తొలిసారి మంత్రి పదవులు దక్కించుకుని, ఏడాదిలోనే మంచిపనితీరు కనబరుస్తూ, తమ శాఖలపై పట్టు తెచ్చుకుని, టీడీపీకి చుక్కలు చూపిస్తూ...ఐదేళ్ల పాటు తమ బెర్త్‌లని కన్ఫామ్ చేసుకునే సత్తా గల మంత్రులు నలుగురు ఉన్నారు.

 

గుడివాడ నుంచి నాలుగోసారి గెలిచిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మచిలీపట్నం నుంచి మూడోసారి గెలిచిన రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, కాకినాడ రూరల్ నుంచి గెలిచిన వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, నెల్లూరు సిటీ నుంచి రెండోసారి గెలిచిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లు ప్రత్యర్ధి టీడీపీకి చెక్ పెట్టే విషయంలో ఫుల్ దూకుడుగా ఉన్నారు.

 

కొడాలి నాని, అనిల్ కుమార్‌లు అయితే ఓ రేంజ్‌లో చంద్రబాబుని, లోకేష్‌ని ఆడేసుకుంటున్నారు. అసెంబ్లీ అవ్వొచ్చు, మీడియా ముందు కావొచ్చు వీరు కాస్త ఘాటు పదజాలం వాడుతూనే దుమ్ములేపుతున్నారు. అటు పేర్ని నాని అయితే వెటకారంతో చురకలు అంటిస్తూ, సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక కన్నబాబు సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ టీడీపీని ఇరుకున పెడుతున్నారు. ఒకోసారి కన్నబాబు కూడా ఘాటుగానే స్పందిస్తూ...చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ నలుగురు మాంచి దూకుడుగా ఉంటూ...టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. కాబట్టి వీరు ఐదేళ్లు పదవుల్లో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: