అనంతపురం జిల్లా...రాప్తాడు నియోజకవర్గం పేరు చెప్పగానే పరిటాల ఫ్యామిలీనే గుర్తొస్తుంది.   2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి ఆ ఏడాదే జరిగిన ఎన్నికల్లో దివంగత పరిటాల రవీంద్ర భార్య పరిటాల సునీతమ్మ టీడీపీ బరిలో దిగి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కేవలం 1950 ఓట్లతో తేడాతో ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికలకొచ్చేసరికి మళ్ళీ ఈ ఇద్దరే ప్రత్యర్ధులుగా దిగారు. కాకపోతే సునీతమ్మ మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తే, తోపుదుర్తి వైసీపీ నుంచి బరిలో దిగారు.

 

ఈసారి కూడా విజయం సునీతమ్మ వైపే నిలిచింది. 7774 ఓట్ల తేడాతో సునీతమ్మ గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఐదేళ్లు సునీతమ్మ నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధే చేశారు. సునీతమ్మ తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా నియోజకవర్గంలో పనులు చూసుకున్నారు. కానీ పరిటాల ఫ్యామిలీ మరీ వన్‌సైడ్‌గా నడుచుకున్నారు. కావల్సిన వారికే పనులు చేసిపెట్టారు. పథకాలు అందించారు. దీంతో నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ మీద వ్యతిరేకిత పెరగడం, అటు రాష్ట్రంలో టీడీపీ మీద వ్యతిరేకిత రావడంతో 2019 ఎన్నికల్లో తోపుదుర్తికి విజయం దక్కింది.

 

అయితే సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని శ్రీరామ్‌కు టిక్కెట్ దక్కేలా చేశారు. తొలిసారి పోటీ చేసి శ్రీరామ్ దాదాపు 25 వేలపైనే మెజారిటీతో తోపుదుర్తి చేతిలో ఓడిపోయారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తోపుదుర్తి దూకుడుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సాధ్యమైన మేర అభివృద్ధి పనులు చేస్తున్నారు. అటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎలాగో వస్తున్నాయి.

 

అయితే రాజకీయంగా రాప్తాడుపై తోపుదుర్తి పట్టు పెంచుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్ ఇంకా పుంజుకోలేదు. కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా చేస్తే, కొన్నిరోజులు అడ్రెస్ ఉండటం లేదు. దీంతో దశాబ్దాలుగా పరిటాల ఫ్యామిలీని మోస్తున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు తోపుదుర్తి వైపు వచ్చేశారు. నిదానంగా తోపుదుర్తి పట్టు తెచ్చుకోవడం, అధికారంలో ఉండటం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: