తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు హైద‌రాబాద్ వాసుల్లో ప‌లువురు కీల‌క విన‌తి చేస్తున్నారు. ముఖ్యంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల వారు తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌మ‌పై ద‌య త‌ల‌చాల‌ని కోరుతున్నారు. ఇదంతా హైద‌రాబాద్‌లో సిటీ బ‌స్సుల గురించి. కరోనా ఎఫెక్ట్తో సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు బ్రేకులు పడ్డాయి. లాక్ డౌన్ స‌డ‌లించిన అనంత‌రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండడంతో బస్సులు నడిపించ‌డం లేదు. దీంతో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయంటున్నారు. 

 

 


లాక్డౌన్ స‌డ‌లింపుల అనంత‌రం రాష్ట్రవ్యాప్తంగా బ‌స్సులు తిరుగుతున్నాయి. కానీ హైద‌రాబాద్‌లో మాత్రం అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఆటోలు, ట్యాక్సీలు తిరుగుతుండ‌గా మెట్రో సర్వీసులు, ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ఓన్ వెహికల్ లేని చిరుద్యోగులు ఆఫీసుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాలంటే రూ.10వేల లోపు జీతం ఉన్నవాళ్లు సగానికిపైగా ట్రాన్స్ పోర్ట్ కే ఖర్చయిపోతుందని ఆవేదన చెందుతున్నారు. లాక్ డౌన్తో 3 నెలలు జీతం లేక ఇబ్బంది పడ్డామని, ఇప్పుడేమో చార్జీలకే సగం శాలరీ అవుతోందని వాపోతున్నారు. కుటుంబం గడవాలంటే జాబ్ చేయక తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. కొందరు ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గించుకునేందుకు ఆఫీస్ టైమ్కు రెండు, మూడు గంటల ముందే రోడ్డు మీదికి వచ్చి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంచెం దూరమైనా కాలినడక వెళ్లే పరిస్థితి ఉన్నవాళ్లు నడుస్తున్నారు. మరీ దూరంగా ఉంటే చార్జీలు భరించలేక ఉద్యోగం మానేస్తున్న వాళ్లూ ఉన్నారు. ర‌వాణా ఖ‌ర్చులు మోయ‌లేని భార‌మ‌వుతోంద‌ని అంటున్నారు. 

 

 

కాగా, ధ‌ర‌ల్లోనూ వాత‌లు పెడుతున్న ప‌రిస్థితి ఉంది. క్యాబుల్లో ఆన్లైన్లో చూపిన చార్జీ మాత్రమే ఉండగా.. ఆటోల్లో ఇష్టం వ‌చ్చినట్లు వసూలు చేస్తున్నట్టు చిరుద్యోగులు చెప్తున్నారు. మినిమమ్ చార్జీ రూ.20 తీసుకుంటున్నారని, మీటర్ వెయ్యడం లేదని వాపోతున్నారు. షేర్ ఆటోలు లేని ఏరియాల్లో నేరుగా మాట్లాడుకొని వెళ్లాల్సి వస్తోంది. అలాంటి చోట్ల ఆఫీసుకు వెళ్లి రావడానికి రూ.200 దాకా ఖర్చవుతున్నాయని వాపోతున్నారు. జిల్లా సర్వీసులు నడుపుతున్న మాదిరిగానే సిటీ బస్సులు నడపాలని కోరుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: