బూర్లంటే అందరికీ ఇష్టమే. తీపిగా ఉండే వాటిని తినాలని ఏ నోరు ఊరదు, కానీ నోటికీ గంపకూ మధ్య చాలా దూరం ఉంది. అదెంటో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది. పార్టీ కూడా నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. కానీ వైసీపీకి దక్కినట్లుగా  ఇంత‌టి ఏకపక్ష తీర్పు ఎపుడూ రాలేదు. పూర్తిగా ఎవరికీ ఏదీ ఇవ్వకుండా మొత్తం పదవులు పంచుకునే గోల్డెన్ చాన్స్ కూడా టీడీపీకి రాలేదు.

 

ఎంత చతికిలపడినా కూడా అప్పట్లో కాంగ్రెస్ పోటీగానే ఉంటూ వచ్చింది. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ గట్టి ప్రతిపక్షంగా ఉంది. దాంతో ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎన్నికలు కానీ పూర్తిగా టీడీపీ సొత్తు అయిన సందర్భాలు లేవు. ఇపుడు మాత్రం జగన్ కి ఇంతటి అవకాశం వచ్చింది. వద్దంటే పదవులు వస్తున్నాయి.

 

మరో ఏడాదిలో మండలి మొత్తం వైసీపీ మయం అవుతుంది అని తెలిసినా జగన్ అప్పట్లో  రద్దుకే సిధ్ధపడ్డారు, అయితే అపుడే ఆరు నెలలు గడచిపోయాయి కానీ మండలి రద్దు కాలేదు. ఈ లోగా మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు జగన్ పంపించారు. దాంతో వారిద్దరి ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం జరిగేవరకూ శాసన‌ మండలి ఉంటుంది. దాంతో ఆ రెండు పదవులూ ఇపుడు వైసీపీకే దక్కనున్నాయి.

 

ఇదే కాకుండా అపుడెపుడో రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీ సీటుకు కూడా ఈ మధ్యనే నోటిఫికేషన్ వచ్చింది. అంటే మూడు ఎమ్మెల్సీ పదవులు మళ్ళీ వైసీపీ వారికి దక్కుతాయన్నమాట. ఇపుడు పదవుల కోసం వైసీపీలో ఆశావహులు ఎదురుచూస్తూంటే ఏ పదవీ లేక ఏదీ ఇవ్వలేక టీడీపీ వట్టిపోయి ఉంది. ఓ విధంగా చెప్పాలంటే బూర్లగంప ఎదురుగా ఉంది. చుట్టూ వైసీపీ ఉంది. దూరం నుంచి ఆ ఘుమఘుమలను చూసి లొట్టలేయడమే టీడీపీ వంతు అవుతోంది మరి. సైకిల్ పార్టీని చూస్తే  అయ్యో పాపమని అనాలేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: