కరోనా ఉద్ధృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ పెరుగుతోంది. సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలకుండా తన కోరలను విస్తరిస్తున్న మహమ్మారి తెలంగాణ లో పలువురు ఎమ్మెల్యేలకు సోకిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో అయితే ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రినే ఐసీయూలో వెంటిలేటర్ పైన పడుకోబెట్టింది. ఇప్పుడు చివరికి ఏపీ లో మొట్టమొదటి ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకడం గమనార్హం.

 

విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కే.శ్రీనివాసరావు కు కరోనా పాజిటివ్ అని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇటీవలే అమెరికా నుండి వచ్చారని మరియు అతనికి కరోనా లక్షణాలు ఉండడంతో ట్రూ నాట్ తోపాటు ఆర్డి ఆర్పి పరీక్షలు కూడా చేసినట్లు మరియు వాటిలో పాజిటివ్ అని ధ్రువీకరించినట్లు కూడా తెలిసింది. ఆయనతో పాటు అతని గన్ మెన్ కు కూడా కోవిడ్ వచ్చినట్లు చెబుతున్నారు.

 

అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా దీనిని ఖరారు చేయలేదు కానీ వార్త తెలిసి ఏపీ ఎమ్మెల్యేలు అందరూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే గత వారమే అతను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం తో పాటు మూడు రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం  కూడా జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశంలో మన ఎమ్మెల్యేలు ఎంతమాత్రం సామాజిక దూరం పాటించేది మనకు తెలిసిందే. దీనితో అతనికి పాజిటివ్ ఉన్నట్లు అధికారికంగా ప్రభుత్వం ధ్రువీకరించేస్తే మన ఎమ్మెల్యేలు అంతా క్వారంటైన్ కు వెళ్ళిపోవడం ఖాయం.

 

రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఇదే మొదటి కేసు కావడం గమనార్హం. ఎమ్మెల్యే శ్రీనివాసరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని గెస్ట్‌హౌస్‌లో ఐసోలేట్ అయినట్లు తెలుస్తోంది దీంతో ఎమ్మెల్యేలు, ఎన్నికల సిబ్బంది, ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే సోమవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్‌తో భేటీ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: