కరోనా మహమ్మారి పోలీసులను సైతం వదలడం లేదు. ఇప్పటికే విధి నిర్వహణలో ఉన్న అనేక మంది పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాద్ లోనే ఇలాంటి కేసులు చాలా బయటపడ్డాయి. ఒకరిద్దరు పోలీసులు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు కూడా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలోనూ కరోనా కలకలం రేపుతోంది.

 

 

హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఇప్పుడు కరోనా టార్గెట్ గా మారింది. ఇక్కడ ఓ ఐపీఎస్ అధికారితో పాటు మరో 20 మంది సిబ్బందికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇక్కడ పనిచేసే ఓ నాలుగో తరగతి ఉద్యోగిని ద్వారా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ క్యాంపస్ లో అడుగు పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 

దీంతో ఆమె విధులు నిర్వర్తించిన ప్రాంతంలోని అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ అంటే చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ రాష్ట్రమంతటికీ చెందిన పోలీసులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే 20 మంది వరకూ సిబ్బందికి కరోనా వచ్చిన విషయం వాస్తవమేనంటున్న అధికారులు దాని ప్రభావం శిక్షణపై ఉండబోదంటున్నారు.

 

 

సిబ్బందికి కరోనా సోకినప్పటికీ పోలీసు అకాడమీలో ఎస్సైలకు శిక్షణ ఆగదని అకాడమీ డైరెక్టర్ వి.కె.సింగ్‌ చెబుతున్నారు. అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న ధ్రువపత్రం ఉంటేనే శిక్షణలో ఉన్న వారి తల్లిదండ్రులను అనుమతిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీకి జిల్లాల్లోనూ శాఖలు ఉన్నాయి. అయితే జిల్లా శిక్షణ కళాశాలల్లో దాదాపు 13 వేల మందికి శిక్షణ యధావిధిగా కొనసాగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: