తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొద్దికాలంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కల‌క‌లం కొనసాగుతున్న త‌రుణంలో ఈ విమ‌ర్శ‌లు- ప్ర‌తి విమ‌ర్శ‌లు మ‌రింత ముదిరాయి. తాజాగా టీఆర్ఎస్ నేత‌, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ఈ సమయంలో ఆస్పత్రుల దగ్గర ధర్నా చేయడం చిల్లర రాజకీయమ‌ని మండిప‌డ్డారు. తెలంగాణ కరోనా కట్టడి చర్యలను కేంద్ర బృందం, వైద్య మంత్రి ప్రశంసించారని తెలిపారు. ఢిల్లీలో మర్కజ్ సందర్భంగా కరోనా ప్రబలితే కేంద్ర ఇంటెలిజెన్సు ఏం చేసింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వలస కార్మికులను ఇబ్బంది గురిచేసింది ఎవరని  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.

 

ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోంద‌ని  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. ``ప్రతిపక్షాలకు ఏ అంశాన్ని ఎత్తుకోవాలో తెలియడం లేదు. లాక్ డౌన్‌లు ప్రకటించడం ఎత్తేయడం కేంద్రం కేంద్రం ఇష్టానుసారంగా చేసింది. రాష్ట్రానికి కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. కేంద్ర ప్యాకేజీ ఏ ఒక్కరికైనా అక్కరకొచ్చిందా? తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్టింగ్ మిషన్ బెంగాల్‌కు ఎవరు తరలించారు?``అని త‌ల‌సాని ప్ర‌శ్నించారు. అమెరికా లాంటి సూపర్ పవర్ దేశానికి కూడా కరోనా భాధలు తప్పడం లేద‌ని త‌ల‌సాని అన్నారు. బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడాలని, పీఎం మోడీ బీజేపీ నేతలను కట్టడి చేస్తే మంచిద‌ని సూచించారు. 


 
బీజేపీ నేతలు ఇలానే మాట్లాడుకుందామంటే తాము కూడా గుజరాత్ నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుందని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. ``కరోనా మొదలైనప్పటి నుంచి దేశంలో ఏం జరిగింది అనేది మాట్లాడడానికి సిద్ధం. హైదరాబాద్ జనాభా కోటి పైనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగినంత మాత్రాన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరు ఈ కేసుల్లో మరణిస్తున్నారో మీడియా వివరాలు తెప్పించుకోవాలి. కరోనాకు ఎవ్వరూ అతీతులు కారు. కరోనా బారిన పడిన వారు చాలా మంది కోలుకుంటున్నారు. బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. అందుకే పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు` అని మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: