కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. అందుకోసమే అక్కడి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ ప్రకటించింది. సోమవారం బెంగళూరు నగరంలోని ఐదు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం పై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

 


కేవలం ఆ ఐదు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తే ప్రయోజనం ఉండదని, బెంగళూరు మొత్తం 20 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. కఠినంగా లాక్ డౌన్ అమలు చేయకపోతే, బెంగళూరు మరో బ్రెజిల్ అవుతుందని తెలిపారు.

 

 

ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవని కుమారస్వామి వరుస సందేశాలలో పేర్కొన్నారు. కార్మికులకు నిత్యావసర సరుకులతోపాటు, రూ .5వేల ఇవ్వాలని కర్నాటకా సర్కారుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ వారికి ఏమాత్రం సరిపోదు. కాబట్టి వారికి అవసరమైన సాయాన్నివెంటనే అందించాలని కోరారు. 

 

 

రెండు నెలల లాక్డౌన్ తర్వాత సడలింపును ప్రజలు  దుర్వినియోగం చేయడంపై యడియూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణికులతో పాటు, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసు కేసులు నమోదు చేయాలని ఆయన  అధికారులకు సూచించారు. జూన్ 22 న కర్ణాటకలో కొత్తగా 249 కోవిడ్-19 కేసులు నమోదు కాగా... ఐదుగురు మృతి చెందారు.

 

 

రాష్ట్రంలో మొత్తం  ఇప్పటివరకు 9,399 కోవిడ్ కేసులుండగా , మరణాల సంఖ్య 142కు చేరుకున్నదన్నారు. సోమవారం చనిపోయిన ఐదుగురిలో ముగ్గురు బెంగళూరు పట్టణానికి చెందినవారే. కర్ణాటక రాజధాని బెంగళూరులోనే  కొత్తగా 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

 

కలబురగి -27, విజయపుర -15, ఉడిపి -14, దక్షిణా కన్నడ -12, దవంగెరే -9 వంటి ప్రాంతాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అందుకోసమే ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేసేందుకు కర్ణాటక సర్కారు సిద్ధమైందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: