పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడంతో గొప్ప రాజ‌నీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్నారు. 

 

తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. అయితే నాటి పీవీ సేవల‌ను ఈ త‌రానికి చాటిచెప్పేందుకు ఆయ‌న సేవ‌ల‌ను ఘ‌నంగా స్మరించుకునేందుకు వీలుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

 

పివి నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన జయంతి అయిన జూన్ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్  మంగ‌ళ‌వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడని.. దేశ గతిని మార్చిన గొప్పవారని కేసీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: