2019 ఎన్నికల్లో జగన్ సునామీ ముందు టీడీపీలో ఉన్న మహామహులంతా ఓటమి పాలైన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు అసలు ఓటమి రుచి తెలియని వారు కూడా గెలుపు వాకిట్లో బోల్తా కొట్టారు. అయితే ఈ జగన్ వేవ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చిత్తుగా ఓడిపోయారు. అయితే చంద్రబాబు ఎలాగోలా విజయం సాధిస్తే, లోకేష్ మామ బాలయ్య కూడా హిందూపురంలో తెలుగుదేశం జెండా ఎగిరేలా చేశారు. కాకపోతే బాలయ్య పెద్దల్లుడు లోకేష్ మంగళగిరి అసెంబ్లీలో బరిలో ఓటమి పాలైతే, ఆయన చినల్లుడు భరత్ విశాఖపట్నం పార్లమెంట్ బరిలో నిలబడి ఓటమి పాలయ్యారు.

 

జగన్ వేవ్ అంతలా ఉన్నా కూడా భరత్ కేవలం 4 వేల మెజారిటీ తేడాతోనే ఓడిపోయారు. అయితే భరత్ బాలయ్య చినల్లుడుగా కంటే ఎం‌వి‌వి‌ఎస్ మూర్తి మనవడుగా విశాఖ వాసులకు సుపరిచితమే. అందుకే ఎన్నికల్లో ఆ మాత్రం పోటీ ఇవ్వగలిగారు. ఇక ఇప్పుడు ఓటమి పాలైనా, నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భరత్ పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఓ వైపు గీతం విద్యాసంస్థలని చూసుకుంటూనే, మరోవైపు విశాఖ పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎలాగో స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారు కాబట్టి, వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు.

 

కానీ ఆ గెలుపు ధీమా జగన్ తీసేసినట్లే కనిపిస్తోంది. జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయనుండటంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారుకుంటూ వచ్చాయి.  టీడీపీకి అనుకూలంగా ఉన్న విశాఖ నగరం నిదానంగా వైసీపీ అధీనంలోకి వచ్చేసింది. ఎలాగో విశాఖ కార్పొరేషన్‌ని వైసీపీనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో కూడా వైసీపీకే ఆధిక్యం కనిపిస్తోంది. దీంతో విశాఖ పార్లమెంట్ స్థానం మళ్ళీ వైసీపీలో ఖాతాలో పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక అప్పుడు కూడా భరత్‌కు విజయం దక్కడం కష్టమవుతుంది. ఏదేమైనా బాలయ్య చిన్నల్లుడుకు జగన్ షాక్ గట్టిగానే తగిలేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: