ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కొత్తగా 462 మందికి వైరస్‌ సోకగా.. 8 మందిని వైరస్ బలితీసుకుంది. ఏ మాత్రం తగ్గని కరోనా వ్యాప్తి రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. 

 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో 20 వేల 639 మంది నమూనాలు పరీక్షించగా.. 462 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారు 15 మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్రంలో మరో 407 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 129 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

 

పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9 వేల 834 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా 24 గంటల్లో మరో 8 మంది మృతిచెందారు. కృష్ణ ,కర్నూల్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. గుంటూరు, కడప జిల్లాలో ఒక్కో మరణం నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 119కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 40, కర్నూలు జిల్లాలో 38 కరోనా మరణాలు సంభవించాయి. 

 

గత 24 గంటల లెక్కలు చూస్తే.. ఉభయగోదావరి, అనంతపురం, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల పరంగా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంటే.. కృష్ణా రెండో స్థానంలో, గుంటూరు మూడో స్థానంలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో.. మళ్లీ లాక్ డౌన్ విధించారు. 

 

ఆదివారం నుంచి వారం పాటు అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లులో లాక్‌డౌన్‌ విధిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. వైరస్‌ వ్యాప్తితో ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఒకరి సంస్మరణ కార్యక్రమం సందర్భంగా కరోనా కేసులు పెరగడంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. బందర్‌లోనూ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి రాజమండ్రిలోనూ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: