ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసాల సస్పెన్షన్‌ను మరో ఆరునెలలు పొడిగించారు. కరోనాను సాకుగా చూపుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లోకల్‌ అమెరికన్లు మేలు చేస్తుందో లేదో కానీ, భారతీయులకు భారీగా దెబ్బకొడుతోంది. అయితే దీనిపై అమెరికాలోని ఎంఎన్‌సీ కంపెనీలు అభ్యంతరం చెబుతున్నాయి. 

 

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయులతో పాటు లక్షలాది మంది వలసదారుల పొట్టకొడుతూ కీలక వీసాల సస్పెండ్ నిర్ణయాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌  నిన్నటితో ముగియడంతో మరోసారి వీసాలను సస్పెండ్ చేయాలని ట్రంప్ నిర్ణయించారు. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన ఒరిజినల్ అమెరికన్స్‌కు ఉద్యోగాలు కల్పించేలా ఈ చర్య తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలతో.. వివిధ రంగాల్లో అత్యంత నైపుణ్యమున్న 5 లక్షల 25 వేల మంది వలసవాదులకు వీసాలు రాకుండా ఆగిపోతాయి. 

 

ఏప్రిల్‌లో రెండు నెలల బ్యాన్ విధించి... ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ జారీ చేసిన ట్రంప్... ఇప్పుడు ఈ ఏడాది చివరి వరకు వాటిని పొడిగించారు. అంటే 2020 డిసెంబర్ వరకు భారత్ తో సహా వివిధ దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు దొరకవు. హెచ్ 1 బి వీసాలతో పాటు... హెచ్‌ 1 బి వీసాలు ఉన్న వ్యక్తుల భాగస్వాములకు ఇచ్చే... హెచ్ 4 వీసా, కంపెనీల మధ్య బదిలీల కోసం అవసరమైన ఎల్ 1 వీసా,  డాక్టర్లు , పరిశోధకుల కోసం ఉద్దేశించిన జే 1 వీసాలపై నిషేధాన్ని పొడిగించారు ట్రంప్. అయితే ఆరోగ్య రంగ నిపుణులతో పాటు కరోనా వైరస్ పై పరిశోధనలు చేస్తున్న వారికి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.

 

వీసాలపై నిషేధాన్ని పొడిగించడంపై సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీలు మండిపడుతున్నాయి. కరోనా కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్న సయమంలో ఈ నిర్ణయం సరికాదంటున్నాయి.  వీసాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఆర్ధిక పురోగతికి వలసవాదులు వెన్నెముకగా నిలిచారని... టెక్నాలజీ విషయంలో అమెరికాను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టింది వారేనంటూ సామాజిక మాద్యమంలో వెల్లడించారు. 

 

ఎన్నికల సమయంలో అమెరికన్లను సంతృప్తి పరిచేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనదేశంపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. డాలర్ డ్రీమ్స్‌తో లక్షలాది మంది టెక్కీలు అమెరికాపై ఆశలు పెట్టుకున్నారు. వీళ్లంతా అమెరికాలో అడుగుపెట్టాలంటే ఈ ఏడాది సాధ్యపడదు. కరోనా బూచిగా చూపి.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను మరోసారి పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: