ఇండియాలో ఉంటూ ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తే అస్సలు ఊరుకునేది లేదని ఇండియా మరోసారి తేల్చి చెప్పింది. ఇండియాలోనే ఉంటూ ఇండియాకు వ్యతిరేకంగా గూఢచర్యం చేస్తున్న పాక్ రాయబార కార్యాలయం సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఉన్నపళంగా ఢిల్లీలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం సిబ్బందిని 50శాతం

తగ్గించాలని ఆదేశించింది.

 

 

అంతే మొత్తంలో పాకిస్థాన్‌లోని తమ రాయబార కార్యాలయంలోనూ ఉద్యోగులను తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలోని పాక్‌ హైకమిషనర్‌కు సమన్లు జారీచేసిన విదేశాంగ శాఖ ఈ మేరకు తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. అందుకూ కారణం ఉంది. ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయం ఉద్యోగులు గూఢచర్యం చేస్తున్నారట.

 

 

అంతే కాదు.. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నారట. ఈ మేరకు కేంద్రానికి పక్కా సమాచారం ఉంది. అందుకే ఈ చర్య తీసుకుంది. గతనెల 31న ఇద్దరు పాక్‌ హైకమిషన్‌ కార్యాలయం సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతూ రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయారు. అంతే కాదు.. ఇస్లామాబాద్‌లో తమ రాయబార కార్యాలయం ఉద్యోగులను తరచూ వేధింపులకు గురిచేస్తున్నారని విదేశాంగ శాఖ ఆరోపించింది.

 

 

పాక్ నుంచి ఇటీవల ఢిల్లీకి తిరిగి వచ్చిన బాధితులు ఆ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. హైకమిషనర్‌ కార్యాలయంలో సిబ్బంది తగ్గింపు నిర్ణయాన్ని వారంరోజుల్లో అమలు చేయాలని పాకిస్థాన్‌ రాయబారికి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఈ చర్య సంచలనాత్మకమైందే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: