తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వందల సంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీలో ఎక్కువగా పెరుగుతున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. మొన్నా తెలంగాణలో ఒక్కసారే 730 కేసులు నమోదు అయ్యాయి. కాకపోతే రికవరీ కూడా బాగానే అవుతుంది. తెలుగు రా‌ష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఉండబోదని ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ఆ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను విధిస్తున్నారు.

 

తాజాగా ఏపీలోని విజయవాడ నగరంలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రకటించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో కూడా కొన్ని అంక్షలు విధించనున్నట్టు చెప్పారు.  ప్రజలు బుధ, గురు వారాల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని వివరించారు.

 

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా వారం పాటు లాక్‌డౌన్‌ పాటించాలని కోరారు.   విజయవాడలో ఇప్పటికే మూడొంతుల డివిజన్లలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇకపై సిటీ మొత్తం పూర్తి లాక్‌డౌన్ ఉంటుందని అన్నారు.  ఇక శుక్రవారం నుంచి ప్రభుత్వ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రజలు ఎవ్వరూ బయట తిరగవద్దని అన్నారు. పరిస్థితులను బట్టి ఈ నెల 30న మరోసారి రివ్యూ నిర్వహించిన తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపు, సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ స్పష్టంచేశారు. కరోనా పై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులు, మంత్రులతో పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: