అస‌లే తిక్క‌. దానికి తోడుగా... ఈ ఏడాది చివ‌రిక‌ల్లా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌డం కోసం అధ్య‌క్షుడు ట్రంప్ వేయ‌ని ఎత్తుగ‌డ లేదు. ఇందులో భాగ‌మే అన్ని ర‌కాల వ‌ర్క్ వీసాలను ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు స‌స్పెండ్ చేసిన నిర్ణ‌యం అమెరికాలో స్థానికుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించాల‌నే ఉద్దేశంతో వర్క్‌ వీసాల జారీని రద్దు చేయడం అని  ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొంటున్న‌ప్ప‌టికీ,  అది ఆయ‌న‌కే ఎదురుత‌న్నుతుంద‌ని తెలుస్తోంది. 

 

సాఫ్ట్‌వేర్ సేవ‌ల సంస్థ నాస్కామ్ దీనిపై తాజాగా స్పందించింది. అమెరికాది తప్పుడు నిర్ణయమని నాస్కామ్‌ పేర్కొంది. వ‌ర్క్ వీసాల ర‌ద్దుపై అమెరికాలో కొత్త సమస్యలు ఉత్పన్నమై ఆ దేశ ఆర్థికవ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికన్లలో అవ‌స‌రానికి స‌రిప‌డా నిపుణులు లేక‌పోవ‌డంతో అక్కడి ఐటీ కంపెనీలు తమ ప్రాజెక్టులను చాలా మేరకు విదేశాలకు తరలించే అవకాశమున్నదని నాస్కామ్‌ అభిప్రాయపడింది. అమెరికాలో ప‌లు ఆస్ప‌త్రులు, ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ సంస్థలతోపాటు వేలాది వ్యాపార సంస్థలకు నాస్కామ్‌ సభ్యులు అత్యవసర సేవలను అందజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.

 

మ‌రోవైపు, అమెరికా ప్ర‌భుత్వ నిర్ణ‌యం, మ‌న టెక్కీల భ‌విష్య‌త్తు గురించి తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల స్పందిస్తూ ఈ వీసాలు పొందాల‌నుకున్న వారు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని తెలిపారు. ఈ నిర్ణ‌యం భార‌తీయుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తుంద‌నే విష‌యం నిజ‌మైన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌ల్లో నుంచి అవ‌కాశాలు వెతుక్కోవాల‌ని ఆయ‌న సూచించారు. అమెరికా టెక్నాల‌జీ కంపెనీలు అభివృద్ధి మ‌రియు ఆ దేశ ఆర్థిక ప‌రిపుష్టిలో భార‌తీయులుగా ప్ర‌త్యేకంగా తెలుగువారిగా మ‌న టెక్కీల స‌హాయం ఎంతో ఉందని సందీప్ మ‌క్తాల తెలిపారు. ఐటీ రంగం అనేది ప్ర‌ధానంగా నైపుణ్యంపై ఉంటుందని, ఈ వీసాల ఆంక్షాల కార‌ణంగా అమెరికా కంపెనీలు స్థానికులను మాత్ర‌మే నియ‌మించుకోవాలంటే వారికి త‌ప్ప‌కుండా అధిక వేత‌నాలు చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు అక్క‌డి స్థానికులు ఇత‌ర దేశాల‌తో పోటీ ప‌డే నైపుణ్యాలు క‌లిగి లేరనే విష‌యాన్ని కంపెనీలు గుర్తించాయ‌న్నారు. ఇలాంటి స‌వాళ్ల నేప‌థ్యంలో ఆంక్ష‌ల అమ‌లు అంత సుల‌భం కాద‌ని పేర్కొన్న సందీప్ మ‌క్తాల టెక్కీలు నిరాశ చెంద‌వద్దని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: