దేశంలో అన్ని సహకార బ్యాంకుల్ని ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తూ.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కోపరేటివ్ బ్యాంక్ సంక్షోభాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కోపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల సొమ్ముకు భద్రత ఉంటుందని కేంద్రం తెలిపింది. అటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. 

 

సహకార బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 1482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఇక ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.

 

ఆర్బీఐ పరిధిలోకి తేవడం వల్ల కోపరేటివ్ బ్యాంకుల్లోని 8.6 కోట్ల మంది ఖాతాదారులకు సొమ్ముకు భద్రత కల్పించినట్టు అవుతుంది. మరోవైపు పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ధ్రువీకరణ పత్రాల జాబితాను కుదించారు. పాస్‌పోర్ట్‌ జారీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హర్యానా ముందంజలో ఉన్నాయి. 

 

ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్ ఎయిర్ పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా స్థాయి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతిచ్చింది. ఓబీసీ కులాల వర్గీకరణ కమిటీ గడువు మరో ఆర్నెళ్లు పొడిగించింది. 2021 జనవరి 31 నాటికి నివేదిక ఇవ్వాలని సూచించింది.

 

ముద్రా శిశు లోన్లు తీసుకున్న వారు.. టైమ్ కు  అప్పు తీరిస్తే.. రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పింది. 50 వేల వరకు  రుణాలు తీసుకున్న వారికి లబ్ధి కలగనుంది. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: