హెచ్ 1 బీ వీసాలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియాకు ఓరకంగా మేలే చేస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికీ ఎలాంటి సమస్యా లేదని, ట్రంప్ నిర్ణయం కారణంగా ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 

 

అమెరికాలో కరోనా వల్ల నిరుద్యోగ సంక్షోభం రావడంతో.. వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు ట్రంప్. హెచ్ 1 బీ, హెచ్ 2 బీ, ఎల్ 1 బీ లాంటి వీసాలపై నిషేధం విధించారు. దీంతో హెచ్ 1 బీ వీసాల ద్వారా అమెరికా వెళ్లాలనుకునే భారతీయులపై ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది. అయితే ట్రంప్ నిర్ణయంతో అంతిమంగా భారత్ కు మేలే జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

 

అమెరికా ఏటా 85 వేల హెచ్ 1 బీ వీసాలు జారీ చేస్తోంది. ఇందులో 60 వేల వీసాలు భారతీయులకే వస్తున్నాయి. ఇప్పుడు కొన్నాళ్ల పాటు వీసాలపై బ్యాన్ ఉండటం కారణంగా.. ఓ ముప్ఫై వేల మందికి కాస్త ఇబ్బంది కలగొచ్చు. కానీ ఇప్పటికే అమెరికాలో ఉన్న హెచ్ 1 బీ వీసాదారులైన భారతీయులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. స్టెమ్ రంగాల్లో నిపుణుల కొరత ఉంటుంది కాబట్టి.. వారు లబ్ధి పొందుతారని భావిస్తున్నారు. 

 

ఇటు భారతీయ ఐటీ కంపెనీలకు కూడా ట్రంప్ నిర్ణయం మేలు చేయనుంది. నిపుణుల కొరత కారణంగా అమెరికా కంపెనీలు పలు ప్రాజెక్టులు ఇండియా కంపెనీలకు అవుట్ సోర్సింగ్ కు ఇస్తాయని, అలా ప్రాజెక్టులు పెరుగుతాయని అంచనా. మరోవైపు వీసాలపై బ్యాన్ కారణంగా అమెరికా వెళ్లలేకపోయిన.. అత్యంత నిపుణులకు స్వదేశంలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దశలో ఉంది కాబట్టి.. ఉద్యోగ కల్పన పెరిగే అవకాశం ఉంది. అప్పుడు సహజంగానే నిపుణులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలా అమెరికా వెళ్లాల్సిన నిపుణులు స్వదేశంలోనే ఉండటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ లాభపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

ఎలాగో అమెరికా వీసాలపై బ్యాన్ ఎక్కువకాలం కొనసాగించే అవకాశం లేదు. ఇప్పటికే అక్కడి టెక్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఏడాది ఆఖరులో జరిగే అధ్యక్ష ఎన్నికల కోసమే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన ఉంది. ఎన్నికల ముగిశాక ఏర్పడే కొత్త ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తెచ్చి.. ఈ బ్యాన్ ఎత్తేసేలా చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: