దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ప్రతిరోజు నమోదవుతున్న కేసుల సంఖ్య 16వేలకు చేరువ అవుతోంది. మొత్తం కేసుల సంఖ్య నాలుగున్నర లక్షలు దాటేసింది. గత 24 గంటల్లో కరోనాతో 465 మంది చనిపోయారు. 

 

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 15,968 కొత్త పాజిటివ్‌ కేసులు, 465 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారిలో 2,58,685మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 14,476 మంది చనిపోయారు.  ప్రస్తుతం 1,83,022 మంది చికిత్సపొందుతున్నారు. 

 

గడిచిన 24 గంటల్లో 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 73,52,911 మందికి కరోనా టెస్టులు చేశారు. పశ్చిబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరోనాతో మృతిచెందారు. మే నెలలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యే తమోనష్‌ ఘోష్‌.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ  తుది శ్వాస విడిచారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం నుంచి ఆయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు.  

 

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. అక్కడ కేసుల సంఖ్య లక్షా 40వేలకు చేరుకుంది. మహారాష్ట్రలో 6 వేల 500 మంది కరోనాతో చనిపోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. ఢిల్లీలో 66 వేల కేసులు ఉండగా.. ఆ తర్వాత తమిళనాడులో 64 వేల కేసులు ఉన్నాయి. మొత్తానికి కరోనా మనదేశంలో విశ్వరూపం చూపిస్తోంది. ప్రజలపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తోంది. ఎంతోమంది అమాయకులను ఆస్పత్రుల పాలు చేయడమే కాకుండా.. మరికొందరి ప్రాణాలు తీసేస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: