ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఉప్పు-నిప్పు మాదిరిగా ఉంటారని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అసలు రెండు పార్టీలు బద్ధశత్రువులుగా ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటారు. ప్రతిరోజూ విమర్శలు చేసుకుంటారు. ఒకోసారి హద్దులు దాటి బూతులు కూడా మాట్లాడుకుంటారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఇలా ఉంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఓ మాజీ టీడీపీ ఎంపీ, ఓ వైసీపీ మంత్రి మాత్రం మంచి సన్నిహిత సంబంధాలు నెరుపుతూ రాజకీయం చేసుకుంటూ ఉంటారు.

 

అయితే వీరి సన్నిహిత సంబంధాలు ఇప్పటివి కాదు. దశాబ్దాల కాలం నుంచి ఆ ఇద్దరు నేతల ఫ్యామిలీలు క్లోజ్‌గా ఉంటూ వస్తున్నాయి. అయితే అలా క్లోజ్‌గా ఉండే నేతలు ఎవరో కాదు. మచిలీపట్నం మాజీ టీడీపీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)లు. ఈ ఇద్దరు నేతల ఫ్యామిలీల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉండవు.

 

పైగా ఎన్నికల సమయంలో ఇరువురు నేతలు మంచిగానే కోపరేషన్ చేసుకుంటారు. ఎంపీ ఓటు అటు, ఎమ్మెల్యే ఓటు ఇటు వేయమని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2009 ఎన్నికల్లో ఇలాంటి సీన్ జరిగిందని రాజకీయ వర్గాలు చెబుతాయి. ఆ ఎన్నికల్లో కొనకళ్ళ టీడీపీ ఎంపీగా గెలిస్తే, పేర్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. పేర్ని అధికారంలో ఉంటే కొనకళ్ళ ఫ్యామిలీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అలాగే కొనకళ్ళ అధికారంలో ఉంటే పేర్నికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే టాక్ కూడా ఉంది.

 

అయితే 2019 ఎన్నికల్లో కొనకళ్ళ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే, పేర్ని మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే గత ఐదేళ్లు అధికారంలో ఉన్న కొనకళ్ళ, ఆయన ఫ్యామిలీ మచిలీపట్నం పరిధిలో పలు భూ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఇక గత ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారికి జగన్ చెక్ పెడుతూ వెళుతున్నారు. కానీ పేర్ని సపోర్ట్ ఉండటం వల్లే కొనకళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళడం లేదని కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే మాజీ ఎంపీకి మంత్రి కోపరేషన్ బాగానే ఉందని గుసగుసలాడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: