జగన్ సర్కార్ కి అన్ని వైపుల నుంచి తలనొప్పులు ఉన్నాయి. ఏపీలో అధికార పక్షానికి అందరూ రాజకీయ ప్రత్యర్ధులే. గతంలో టీడీపీకి వైసీపీ ఒక్కటే ప్రధాన‌ శత్రువుగా ఉండేది. జనసేన, బీజేపీ మిత్రులుగా ఉండేవారు. నాడు కాంగ్రెస్, వామపక్షాలు బాబు మీద  విమర్శలు చేసినా అవి పెద్దగా ఉండేవి కావు. ఇపుడు మాత్రం కుడి ఎడమ తేడా లేకుండా అంతా జగన్ కి యాంటీ అయ్యారు.

 

ఈ నేపధ్యంలో వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ, జగన్ పార్టీలోకి వస్తారు అని పుకార్లు పెద్ద ఎత్తున వచ్చిన నేపధ్యం ఉన్న నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల దాడి చేశారు. ఆయన తనకు రాజకీయాలు వద్దు అనేశారు. తాను ప్రజల పక్షం అన్నారు. ఆయన గత ఏడాదిగా జగన్ సర్కార్ని పెద్దగా విమర్శించలేదు. కానీ తాజాగా ఆయన మీడియా మీటింగు పెట్టి మరీ వైసీపీ సర్కార్ని చెడుగుడు ఆడేసారు.

 

జగన్ చేస్తున్నది తప్పు అంటూ గట్టిగానే గర్జించారు. కోర్టులతో, ఎన్నికల సంఘంతో పెట్టుకోవడమేంటి జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. జగన్ రాజకీయ ప్రత్యర్ధులను వేధిస్తున్నారు అన్న టీడీపీ మాటలను నిజం అన్నట్లుగా మాట్లాడారు, ఇదే ఇపుడు వైసీపీని కలవరపరుస్తోందిట. ఉండవల్లి వైఎస్సార్ సన్నిహితుడు. ఆయన ఎంతో కొంత జగన్ కి అనుకూలంగా ఉంటారనుకుంటే గట్టిగా వాయించేయడంతో ఇపుడు ఆయన‌తో పరిచయం ఉన్న వారు, వైఎస్సార్ సమకాలీనులు కూడా మధనపడుతున్నారుట.

 

జగన్ కి విపక్షాల సహకారం ఏదీ లేదు. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ఈ కీలకమైన సమయంలో ఉండవల్లి లాంటి వారు జగన్ కి సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అలా కాకుండా టీడీపీకి బలం ఇచ్చేలా ఉండవల్లి వంటి రాజకీయ  తటస్థులు మాట్లాడితే అది జగన్ సర్కార్ కి మరింత మైనస్ అవుతుంది అంటున్నారు. మొత్తానికి ఉండవల్లి ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా సంధించిన రాజకీయ బాణాలు జగన్ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: