తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, టీఆర్ఎస్ నేత క‌ల్వ‌కుంట్ల క‌విత పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి రంగం సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. తాజాగా, త‌మ పార్టీ అనుబంధ విభాగ‌మైన తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం త‌ర‌ఫున ఆమె ప్ర‌త్య‌క్ష‌ పోరులో ఎంట్రీ ఇస్తున్నారు. ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసేలా ప్ర‌క‌ట‌న చేశారు. దేశవ్యాప్తంగా 42 బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం కార్మికులకు, సింగరేణికి ద్రోహం చేసే అంశమని టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నెల 26న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్టుమెంట్ల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని వెల్లడించారు.

 


వచ్చే నెల 2న సమ్మెకు టీజీబీకేఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ అనుబంధ టీజీబీకేఎస్ బలోపేతంపై కవిత దృష్టి సారించారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి కల్వకుంట్ల కవిత నడుం బిగించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రేపు సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జూలై 2న 24 గంటలపాటు సమ్మె నిర్వహించి కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కల్వకుంట్ల కవిత చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటికరించడాన్ని విరమించుకునేంతవరకు దశలవారిగా ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు కవిత హెచ్చరించారు. బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం దారుణమనీ, ఇది కేవలం విదేశీ, ప్రైవేటు వ్యక్తులకు ఎర్ర తివాచీ పరిచి కార్మికులకు ద్రోహం చేసే చర్య అని తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, సింగరేణి నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో సింగరేణి బొగ్గుగని కార్మికులంతా పాల్గొనాలని కవిత పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: