రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తాజాగా సీఎం జ‌గ‌న్ మరియు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుపించారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి నివారణలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిప‌డ్డారు. క‌రోనా వైరస్ కారణంగా ఉండవల్లి అరుణ కుమార్ గత మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో సుమారు మూడు, నాలుగు నెలల తరువాత మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి‌.. జ‌గ‌న్ స‌ర్కార్‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

 

ఈ క్ర‌మంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాస్క్‌ పెట్టుకోకుండా కన్పించడం మంచిది కాద‌ని.. మాస్క్‌ లేకపోతే జరీమానా వేస్తామని అందరికీ ప్రభుత్వం చెబుతున్న దరిమిలా, ఆ నిబంధన ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. క‌రోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న వేళ అందరికి ఆదర్శంగా ఉండాలి కానీ.. ముఖ్యమంత్రి జగన్ మాస్క్ పెట్టుకోకుండా ప్రజలను పెట్టుకోవాలని కోరడం అదే విధంగా అధికారులు ధరించకపోవడం తప్పుడు సంకేతాలను పంపుతాయని ఆయ‌న హెచ్చరించారు. దీనిపై భగవద్గీత శ్లోకాలను వల్లెవేసి ఉత్తములు దేనినైతే ఆచరిస్తారో లోకం దానిని పాటిస్తోందని ఉండ‌వ‌ల్లి చుర‌క‌లు అంటించారు. 

 

కాగా, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ, ఇతరత్రా సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగ‌న్మోహ‌న్ రెడ్డి‌ మాస్క్‌ లేకుండా క‌నిపించారు. పలువురు మంత్రులు కూడా మాస్కులు ధ‌రించ‌కుండా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజ‌న్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ లో కూడా సాధారణ ప్రజానీకం మాస్కులపై జరీమానాల గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాస్క్ ధరించడంలేదు.? అని కొంద‌రు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికైనా మాస్క్ ధ‌రించాల‌ని డిమాండ్ చేశారు. మ‌రియు ఈ క్ర‌మంలోనే పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదని అన్నారు.  అధికారంలోకి వచ్చింది ప్రత్యర్థులపై తీర్చుకోవడానికి కాదని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: