సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం జగన్‌కు సాటిలేదనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది పాలనలో ఆయన అనేక సంచలనమైన నిర్ణయాలు తీసుకుని ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్రనే సృష్టించారు. అయితే తాజాగా కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు మరోసారి ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఇచ్చారు.

 

కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన డొక్కా...2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత ఎమ్మెల్సీకి, టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవికి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో జగన్ మళ్ళీ డొక్కాకే అవకాశం కల్పించారు. ఇది శాసనసభ సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి కావడంతో, వైసీపీకే పదవి దక్కనుంది. టీడీపీకి బలం లేకపోవడం వల్ల పోటీలో లేదు. దీంతో డొక్కా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు.

 

ఇక డొక్కా పరిస్తితి ఇలా ఉంటే, వైసీపీకి మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు మద్ధతు తెలిపారు. శివనాథ్ రెడ్డి, శమంతకమణి, పోతుల సునీత లు వైసీపీ వైపు వచ్చారు. కానీ వీరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయలేదు. అయితే వీరికి జగన్ పరంగా మళ్ళీ పదవి దక్కుతుందని ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది. అందుకే వారు పదవులకు రాజీనామా చేయకుండా ఉన్నారని సమాచారం.

 

పైగా మండలి కూడా రద్దు కానున్న నేపథ్యంలో రాజీనామా చేసి పదవులు పోగొట్టుకోవడం ఎందుకని ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిపై వేటు వేయాలని టీడీపీ చూస్తోంది. ఇప్పటికే మండలి ఛైర్మన్‌కు ముగ్గురుపై అనర్హత వేయాలని ఫిర్యాదు కూడా చేశారు. కానీ వీరు మాత్రం అనర్హత వేటు తప్పించుకునేందుకు ఛైర్మన్‌ ముందు విచారణకు కూడా హాజరు కావడం లేదు. మొత్తానికైతే వీరు వైసీపీ వైపు ఉన్న ఎమ్మెల్సీ పదవులు వదులుకోవడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: