నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు అన్నట్టుగా ఉంది. ఇప్పటి కే ఏపీ ప్రభుత్వం పైన, జగన్ తీరు పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడం, పదేపదే పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలు జగన్ సీరియస్ గానే తీసుకున్నారు. దీంతో ఆయనకు నోటీస్ కూడా జారీ చేశారు. వారం రోజుల్లోగా దానికి సరైన సమాధానం చెప్పాలని ఆదేశించారు. ఈ మేరకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రఘురామకృష్ణంరాజు కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన రఘురామకృష్ణంరాజు పార్టీ అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు అంటూ ఆయన ప్రశ్నించారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం అనేది ఒకటి ఉందా అంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. ఒకవేళ క్రమశిక్షణ సంఘం అనేది ఉంటే ఆ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా ? క్రమశిక్షణ సంఘానికి చైర్మన్, సభ్యులు ఎవరిని ప్రశ్నించారు. క్రమశిక్షణ సంఘం మినిట్స్ ఉంటే తనకు పంపాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ని రఘురామకృష్ణరాజు కోరారు. 


ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డైలమాలో పడింది. రఘురామకృష్ణంరాజు రాజీకి వస్తారు అనుకుంటే ఇలా ఒక్కసారిగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో వారంతా షాక్ కి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై త్వరలోనే సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆయన బిజెపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: