భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పినా .. చైనా తీరు మారలేదు. డ్రాగన్ ఇంకా తోక జాడిస్తూనే ఉంది. గాల్వాన్ ఘటనకు మనదేశమే కారణమంటూ  విషం కక్కుతోంది. అయితే.. సరిహద్దులో చైనా ఏ స్థాయిలో బలగాలు, ఆయుధాలు మోహరించిందో స్పష్టం చేసే శాటిలైట్ ఫోటోలు బయటపడ్డాయి... డ్రాగన్ అసలు రూపాన్ని ప్రపంచం ముందుకు తెచ్చాయి. 

 

చైనా ప్రభుత్వం మ‌రోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. భారత్ పై బుకాయింపునకు దిగింది. ఒక‌వైపు సైనిక‌, దౌత్య ప‌రంగా చర్చలు జ‌రుపుతూనే మ‌రోవైపు త‌ప్పంతా భార‌త్‌దే అని మొండిగా వాదిస్తోంది. గ‌ల్వాన్ లోయ‌లో త‌మ సైనికుల‌ను మొదట భార‌తీయులే క‌వ్వించార‌ని బుర‌ద జ‌ల్లుతోంది. ల‌ద్దాఖ్ స‌మీపంలోని గ‌ల్వాన్ లోయ‌లో భార‌త‌, చైనా సైనికుల మ‌ధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రులు అయ్యారు. రెట్టింపు సంఖ్యలో చైనీయులు సైతం హ‌త‌మ‌య్యార‌ని నిఘా వ‌ర్గాల స‌మాచారం.  స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్తతలను త‌గ్గించేందుకు రెండు దేశాలు సైనిక‌, దౌత్య స్థాయిలో చర్చలు జ‌రుపుతున్నాయి. ఇక.. వెన‌క్కి త‌గ్గేందుకు రెండు వ‌ర్గాలు అంగీక‌రించాయ‌ని ఒక‌వైపు చెబుతున్న చైనా.. అస‌లీ ఘ‌ర్షణకు భార‌త జ‌వాన్లే కార‌ణ‌మంటూ  ద్వంద్వ నీతికి పాల్పడింది. గ‌ల్వాన్ లోయ‌లో ముందుగా భార‌తీయులే క‌వ్వించార‌ని  ఆ దేశ విదేశాంగ‌, రక్షణ మంత్రిత్వ శాఖ‌లు ఆరోపించాయి. 

 

భారత్ పై  విషం కక్కుతున్న చైనా.. అసలు సరిహద్దుల్లో  ఏం చేస్తోందన్న ప్రశ్నకు ..  తాజా ఉపగ్రహ చిత్రాలు సమాధానం చెబుతున్నాయి.  తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించాలని రెండు దేశాలు ఏకాభిప్రాయానికొచ్చిన మరునాడే చైనా పన్నాగాలు బయటపడ్డాయి. ఒకవైపు రెండు దేశాల లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల చర్చలు జరుగుతుండగానే డ్రాగన్‌ దేశం ఉద్రిక్త ప్రాంతంలో పనులు కొనసాగించింది. 

 

తాజాగా విడుదలైన హై రిజల్యూషన్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో గల్వాన్‌ నది వద్ద వాస్తవాధీన రేఖకు రెండు వైపులా చైనా పలు రక్షనాత్మక నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడైంది. భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న ప్యాట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద చైనా బలగాలకు వసతి గృహాలు, గల్వాన్‌ నదిపై కల్వర్టు చేపట్టినట్టు తెలుస్తోంది. జూన్‌ 22కు సంబంధిచిన ఈ ఉపగ‍్రహ చిత్రాలను మాక్సర్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసింది. ఈ ఉపగ్రహ చిత్రాల ప్రకారం ప్యాట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద మే 22న ఒక్క టెంట్‌ మాత్రమే ఉండగా.. తాజాగా వెలువడ్డ చిత్రాలు చైనా రక్షణాత్మక స్థానాలను చూపుతున్నాయి.

 

గల్వాన్‌ నది వద్ద రోడ్డు వెడల్పు పనులనూ చైనా చేపట్టినట్టు తెలుస్తోంది. అంతకుముందు విడుదలైన ఛాయాచిత్రాల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఒక టెంట్‌ మాత్రమే ఉంది. చైనా ఆకస్మిక దాడికి చేసేందుకే వాస్తవాధీన రేఖ వెంట రక్షణాత్మక నిర్మాణాలు చేపట్టి ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: