కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. జూలై 1 నుంచి 15 వరకు జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐసీఎస్ఈ కూడా సీబీఎస్ఈ బోర్డు నిర్ణయాన్నే ఫాలో అవుతోంది. 

 

దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు.. సీబీఎస్ఈ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు పూర్తైనా.. ఈశాన్య ఢిల్లీలో మాత్రమే అల్లర్ల కారణంగా వాయిదా పడ్డాయి.

 

అక్కడ మాత్రమే పరీక్షలు జరగాల్సి ఉంది. మరోవైపు పరిస్థితులు కుదుటపడగానే.. పన్నెండో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ సుప్రీంకోర్టుకు చెప్పింది. ఐసీఎస్ఈ కూడా సీబీఎస్ బాటలోనే పరీక్షలు రద్దు చేసింది. 

 

ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేమని చెప్పాయని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. పన్నెండో తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తామని ప్రకటించింది. పరీక్షలకు హాజరవ్వాలా.. లేకపోతే ఇంటర్నల్ మార్కుల ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలా అనేది వారిష్టమని చెప్పింది. ఆ ఫలితాలు జులై 15న వెల్లడిస్తామని తెలిపింది. 

 

సీబీఎస్ఈ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రేపటిలోగా నోటిఫికేషన్ ఇస్తామని సీబీఎస్ఈ బోర్డు కోర్టుకు చెప్పింది. సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పరీక్షల నిర్వహణలో స్టేట్ బోర్డుల పాత్ర గురించి కోర్టు అడగగా.. సీబీఎస్ఈకి సహాయకారిగా మాత్రమే ఉంటాయని సొలిసిటర్ జనరల్ బదులిచ్చారు. కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్లో స్టేట్ బోర్డుల్ని కూడా ప్రస్తావించాలని సీబీఎస్ఈకి కోర్టు సూచించింది. మొత్తానికి సీబీఎస్ ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టకూడదని నిర్ణయించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: