కుక్క‌కాటుకు చెప్పు దెబ్బ అన్న చందంగా చైనాతో భార‌త్‌ వ్య‌వ‌హ‌రిస్తోంది. కాదు పోమ‌న్న క‌య్యానికి కాలు దువ్వుతున్న చైనాకు త‌గిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భార‌త బ‌ల‌గాలు వేచి చూస్తున్నాయి. ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తన బలగాలను  చైనా మోహరిస్తూ వ‌స్తోంది. అయితే భార‌త్ కూడా అదే విధంగా స‌రిహ‌ద్దు వెంబ‌డి భారీగా బ‌ల‌గాల‌ను మొహ‌రింప‌జేస్తోంది. ఈక్ర‌మంలోనే 3,488 కి.మీ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్ కూడా భారీగా సైన్యాన్ని తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం.  భారత ప్ర‌భుత్వం‌ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది.

 

పర్వత ప్రాంతాల్లో పనిచేయడం కోసం క‌ఠోర‌ శిక్షణ పొందిన బలగాలను స‌రిహ‌ద్దుల‌కు త‌ర‌లించింది. ఈ బ‌ల‌గాల‌కు ఎత్త‌యిన‌ ప్రాంతాల్లో చైనా అతిక్రమణల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొట్టే సామ‌ర్థ్యం ఉంది. ఈ బ‌ల‌గాలు స‌రైన మార్గం లేని, వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు కాలిన‌డ‌న‌ వెళ్లి యుద్ధం చేయగలవు. పాకిస్తాన్ తో జ‌రిగిన కార్గిల్‌ యుద్ధ సమయంలో కూడా ప్ర‌త్యేక‌ బలగాలు కీలకపాత్ర పోషించాయి. భాగంగా భారత సైన్యానికి చెందిన అదనపు బలగాలతో పాటు ఇండో-టిబెట్‌ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)దళాలను కూడా పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐటీబీపీ దళాల తరలింపుపై శనివారం నిర్ణయం తీసుకోనున్నారు.

 

ఈ మేరకు మిలిటరీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్‌ దేస్వాల్‌లు శనివారం లేహ్‌ ప్రాంతంలో పర్యటించనుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది.  ప్రతి గస్తీ పాయింట్ వద్ద సైన్యానికి తోడుగా ప్లాటూన్‌కు బదులు కంపెనీలను ఉంచాలని నిర్ణయించినట్లు ర‌క్ష‌ణ రంగ ఉన్న‌తాధికారులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా మండలికి అందిన నివేదికల ప్రకారం సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయ, హాట్ స్ప్రింగ్స్‌, పాంగాంగ్ లేక్‌ మూడు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. అయితే భారత్ మాత్రం  ఏప్రిల్30, 2020 ఉన్న యథాస్థితిని పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: