టీడీపీ ఘోరతిఘోరంగా ఓడిపోయి ఏడాది దాటుతుంది. అయితే ఈ ఏడాది సమయంలో టీడీపీ ఏమన్నా పుంజుకుందా అంటే? పెద్దగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సరే సీఎం జగన్ క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఆయన చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజల మద్ధతు ఇంకా పెరిగింది. కాకపోతే జగన్ పాలన బాగున్నా… కొన్ని నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడం వల్ల టీడీపీకి కాస్త పుంజుకునే అవకాశం దొరికింది.

 

అలా టీడీపీకి బాగా పుంజుకునే అవకాశం దక్కింది...అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో. 2019 ఎన్నికల్లో కేవలం జగన్ ఇమేజ్‌తో వైసీపీ అభ్యర్ధిగా నిలబడిన పెదబల్లి వెంకట సిద్ధారెడ్డి విజయం సాధించారు. కానీ ఆయన జగన్ ఇచ్చిన గెలుపుని నిలబెట్టుకోవడం లేదని తెలుస్తోంది. ఏడాది కాలంలో ఆయనపై వ్యతిరేకిత పెరిగినట్లు కనబడుతోంది. నియోజకవర్గంలో అసలు అభివృద్ధి లేకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, దందాలు చేయడం, ఉమెన్ ట్రాఫికింగ్, త్రాగునీరు సమస్య పెరగడంలాంటి వాటి వల్ల ఎమ్మెల్యేపై వ్యతిరేకిత వచ్చింది.

 

ఇక టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్...నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మామూలుగానే కదిరిలో కందికుంటకు మంచి క్రేజ్ ఉంది. 2004లోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 40 వేలు ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిల్చున్నారు. ఇక 2009లో టీడీపీ తరుపున గెలిచి, నియోజకవర్గంలో మంచిగా పనులు చేశారు. కానీ 2014 ఎన్నికల్లో కేవలం 968 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

 

అయితే 2019 ఎన్నికల్లో జగన్ గాలి దెబ్బకు 27 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంత భారీ ఓటమి వచ్చినా...కందికుంట కదిరి ప్రజలని వదలుకోలేదు. నిత్యం వారి కోసం పోరాడుతూనే ఉన్నారు. అటు కార్యకర్తలని కలుపుకునిపోతూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకిత రావడం, కందికుంట మంచి పనితీరు కనబర్చడంతో కదిరిలో టీడీపీ బాగా పుంజుకుంది. అసలు వచ్చే ఎన్నికల్లో కదిరిలో టీడీపీ నేత కందికుంట గెలుపు ఖాయమని ఇప్పటి నుంచే నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: