రాజు గారు వైసీపీ ద్వారా ఎంపీ అయ్యానంటే ఒప్పుకోరు. వైసీపీలో చేరి జగన్ జెండాను భుజానికెత్తుకుని గెలిచానంటే అసలు ఒప్పుకోరు. ఇక ఆయన మరో విషయమూ చెబుతున్నారు. నర్సాపురం టీడీపీకి కంచుకోట అని తాను బాహుబలిగా అక్కడ నిలబడబట్టే వైసీపీకి ఊపిరీ, ఉసురూ దక్కిందని కూడా రాజుగారు అంటున్నారు. సరే టీడీపీ కంచుకోటలు ఏపీవ్యాప్తంగా 2019 ఎన్నికల్లో మంచుకోటలు అయిపోయిన సంగతికి బహుశా రాజుగారు కావాలనే కన్వీయినెంట్ గా మరిచారనుకోవాలి. మొత్తానికి గోదావరి వెటకారం అంతా రంగరించి మరీ వైసీపీ అధినాయకత్వం మీద కారాలూ మిరియాలూ రాజుగారు నూరేశాక ఇక తేగేది తాడే మరి.

 

అందుకే అందరూ రాజు గారి వైపు ఇపుడు చూడడంలేదు, ఆయన మీడియా మాటలను కూడా వినడంలేదు. అంతా వైసీపీ హైకమాండ్ వైపు మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే రియాక్షన్ వైపే ఇపుడు రాజకీయం ఎరిగిన వారి చూపు అంతా ఉంది. రాజుగారు నూరు తప్పులు చేశారని వైసీపీ లెక్కిస్తే ఆయన మీద వేటు ఖాయమే. ఆయన ఇంకా తొంబై తొమ్మిది తప్పుల దగ్గరే ఉన్నారనుకుని షోకాజ్ అన్నారు.

 

ఇపుడు అన్ని కాజులూ క్లాజులూ అవసరం లేకుండానే వేటేస్తారని టాక్ నడుస్తోంది. రాజు గారు హద్దులు దాటేశారు అని  ఆయన సమాధానం కాని సమాధానం బట్టి అర్ధమవుతోంది. ప్రశ్నకు ప్రశ్న ఎపుడూ సమాధానం కాదు, ఆ సంగతి రాజావారికి కూడా తెలుసు. అందుకే ఆయన కావాలనే మరింత కెలికారు.

 

ఇపుడు వేటుకు వైసీపీ రెడీ అవుతుంది. అపుడు సానుభూతి వస్తుందని రాజుగారు అనుకుంటున్నారు. కానీ గత ఆరేడు నెలలుగా రాజు గారి ఎపిసోడ్ చూస్తున్న వారంతా ఏడాదిలో ఎందుకు ఫ్యాన్ నీడ నుంచి వేరు పడ్డారనే ఆలోచిస్తారు. పైగా సానుభూతులు అనుభూతుల రోజులు కావు ఇవి. అందువల్ల రాజుగారి మీద వేటు పడితే ఆయన హీరో అయిపోతారని ఎవరైనా భ్రమలు పెట్టుకున్నా శుధ్ధ దండుగే. 

 

ఆయన ఎంపీ పదవికి మరో నాలుగేళ్ళ ఆయుష్షు మాత్రం ఉంటుందని మాత్రం అనుకుంటారు. మొత్తానికి రాజు గారు సొంతంగా ఆలోచించి ఇలా చేశారా వెనక శక్తులు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా రాజకీయ  చర్చగా ఉంది. ఏది ఏమైనా 22 మంది ఎంపీలు వైసీపీకి ఉంటే అందులో ఒకరు తగ్గినా పోయేదీలేదన్న ధీమా వైసీపీది. టోటల్ గా ఇది కూడా గత జంపింగ్ జఫాంగుల కధలా పాతపడిపోతుంది అంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: