తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. అయితే తెలంగాణలో చేస్తున్న కరోనా పరీక్షల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ కేసులు వందల సంఖ్యలో వస్తున్నాయి. అంటే కరోనా ఏ రేంజ్‌ లో ఉందో ఊహించుకోవచ్చు. అయితే హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో 50 వేల కరోనా టెస్టులు చేయిస్తానని ఇటీవల కేసీఆర్ అన్నారు.

 

 

ఇది కాస్త ప్రజలకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ లో పలు చోట్ల ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇంతలోనే సర్కారు ఆ పరీక్షలకు బ్రేక్ ఇచ్చింది. అధిక సంఖ్యలో కరోనా పరీక్షలకు నమూనాల సేకరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ధ్రువీకరించింది. అందుకు కారణాలు తెలియజేస్తూ వైద్యారోగ్యశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఈనెల 16 నుంచి ఇప్పటివరకు 36 వేల నమూనాలు సేకరించామని తెలిపారు.

 

 

అయితే వాటిలో ఇంకా 8వేల253 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. నమూనాలు సేకరించాక 48 గంటల్లోగా పరీక్షలు చేయాలని వెల్లడించారు. ఇంకా నమూనాల ఫలితాలు రావాల్సి ఉందన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు.. ఆ లోపు మళ్లీ నమూనాలు సేకరిస్తే భద్రపరచేందుకు సమస్యలు వస్తాయని వివరించారు. అప్పటి వరకు శిబిరాల్లో నమూనాల సేకరణను మాత్రమే నిలిపివేశామని తెలిపారు.

 

 

అయితే.. కరోనా పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. పెద్దమొత్తంలో సేకరించిన నమూనాల ఫలితాలు వెల్లడవగానే శిబిరాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఏదేమైనా కరోనా పరీక్షల నిర్వహణ విషయంలో తెలంగాణ మొదటి నుంచి అంతగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: