రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న కాపు ఓటర్లని ఆకర్షించేందుకు సీఎం జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న ఎన్నికల్లో ఎక్కువ శాతం తనవైపు నిలబడ్డ కాపులకు న్యాయం చేసేందుకు జగన్ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేశారు. సాధారణంగా వచ్చే పథకాలతో పాటు వారికి ప్రత్యేకంగా కొన్ని పథకాలు అందిస్తున్నారు. కాపు కార్పొరేషన్ పేరిట సాయం కూడా అందిస్తున్నారు. ఇక తాజాగా అయితే ‘కాపు నేస్తం’ పేరిట సరికొత్త స్కీమ్ ప్రవేశ పెట్టారు.

 

ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. ఈ ఏడాది లబ్ధిదారులకు నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా తొలి ఏడాది దాదాపు 2,35,873 మంది మహిళలకు లబ్దిచేకురనుంది. ఈ పథకం 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు వర్తిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది కాపు మహిళలకు రూ.15 వేలు అందాయి.

 

అయితే కాపు నేస్తం పథకం పట్ల రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అదే కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లు కాపులకు చంద్రబాబు ఏం చేయకపోయినా ప్రశ్నించని పవన్...ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఏ పథకం కింద లబ్ధిచేకూర్చినా..అది కాపులను ఉద్ధరించడానికే అని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇలా పవన్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో కాపు వర్గం ప్రజలే అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాపులని అనేక విధాలుగా మోసం చేసిందని, అప్పుడు మాత్రం పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఇప్పుడు జగన్ కాపులకు అండగా ఉన్నప్పుడు పవన్ విమర్శలు చేస్తూ, కావాలనే రాజకీయం చేస్తున్నారని అర్ధమవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: