జగన్ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే.  నవరత్నాల హామీలతో పాటు అవినీతిని అంతం చేస్తానని జగన్ ప్రధానంగా చెప్పారు. అయితే ఆ హామీ లని ప్రజలు పూర్తిగా నమ్మి జగన్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఇక జగన్ కూడా అధికారంలోకి రాగానే...ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. చెప్పిన సమయానికి చెప్పినట్లుగా పథకాలు అందిస్తున్నారు.

 

అలాగే అవినీతి విషయంలో జగన్ కఠినంగానే వ్యవహరిస్తూ, అవినీతి లేని పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డ నేతలకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి దానిపై విచారణ జరిపిస్తూ, టీడీపీ నేతల అవినీతిని బయటకు లాగుతున్నారు. ఇప్పటికే ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. జగన్ అవినీతిని ఏ మాత్రం సహించకుండా ముందుకెళుతున్నారు.

 

జగన్ వరకు...అవినీతి విషయంలో స్ట్రాంగ్‌గానే ఉన్నారు. కానీ కింది స్థాయిలో అంటే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎలాంటి అవినీతికి పాల్పడటం లేదా? అంటే సమాధానం చెప్పడం కష్టమని విశ్లేషుకులు అంటున్నారు. కింది స్థాయిలో అవినీతి ఎక్కువగానే జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఇసుక విషయంలో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుందని, అదేవిధంగా భూముల కుంభకోణాలు, ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు నిత్యం వార్తలు వస్తున్నాయి.

 

వైసీపీ నేతల అవినీతి విషయంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రతిరోజూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే టీడీపీ నేతలే కాకుండా, సొంత పార్టీ నేతలు సైతం తమ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇసుక, ఇళ్ల స్థలాల పంపిణీ, మద్యం విక్రయాల్లో అవినీతి ఎక్కువ ఉందని, అలాగే నియోజకవర్గ స్థాయిలో వసూళ్లు కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. మొత్తానికి అవినీతి జరగకుండా చూసే విషయంలో జగన్ స్ట్రాంగ్‌గా ఉంటే, కొందరు వైసీపీ నేతలు అవినీతి చేస్తూ మాత్రం కొంపముంచేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: