అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించడం కలకలం రేపుతోంది. పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు కూడా ఇమ్రాన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టాయి. ఉగ్రవాదిని అమరవీరుడని చెప్పడమేమిటని మండిపడ్డాయి. 

 

అమెరికాపై భీకర దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అమరవీరుడని సంబోధించడం పట్ల విపక్షం మాజీ క్రికెటర్‌పై విరుచుకుపడింది. 2011లో అమెరికన్‌ దళాలు అబోటాబాద్ లాడెన్‌ స్ధావరంపై దాడిచేసి ఆయనను మట్టుబెట్టిన ఉదంతాన్ని ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంటులో ప్రస్తావించారు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికన్‌ హెలికాఫ్టర్లు లాడెన్‌ స్ధావరంపై దాడికి తెగబడిన ఆపరేషన్‌ గురించి పాకిస్తాన్‌కు తెలియదని, అమెరికన్‌ దళాలు ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చి అమరుడిని చేయడం పట్ల పాకిస్తానీలుగా ఎంత ఇబ్బందులకు గురయ్యామో తాను ఎన్నటికీ మరవలేనని చెప్పుకొచ్చారు.

 

కాగా ఇమ్రాన్‌ వ్యాఖ్యలను విపక్ష నేత, పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ తప్పుపట్టారు. కరుడుగట్టిన ఉగ్రవాదిని అమరుడిగా ఇమ్రాన్‌ ఖాన్‌ కొనియాడారని వ్యాఖ్యానించారు. బిన్‌ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన సమయంలో అధికారంలో ఉన్న పీపీపీ నేత బిలావల్‌ బుట్టో జర్ధారి సైతం ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హింసాత్మక అతివాదాన్ని ప్రధాని సమర్ధిస్తున్నారని దుయ్యబట్టారు. 

 

పాకిస్థాన్‌ను చిరకాల మిత్రదేశంగా భావించే అమెరికా కూడా ఆ దేశం అసలు స్వరూపం గ్రహించింది లాడెన్‌ను హతమార్చిన సమయంలోనే. ఆ విషయంపైనే పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. తాను ఓ దేశ ప్రధానినని, తాను మాట్లాడుతోంది ప్రపంచమంతా ఉగ్రవాదిగా గుర్తించిన లాడెన్ గురించి అన్న స్పృహ లేకుండా ఆయన్ను అమరవీరుడిగా కీర్తించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉగ్రవాద ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలపై వివక్ష కొనసాగుతున్న వేళ...ఓ ఉగ్రవాదిని అమరుడిగా కీర్తించడం ద్వారా ఇమ్రాన్ వారిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: