జులై ఒకటి నుంచి 15వరకు జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి. అయితే జులై 15న ఫలితాలు విడుదల చేయనుంది సీబీఎస్ ఈ. పరీక్షలు అన్నీ రాయకున్నా.. ఫలితాలు వెల్లడించేందుకు ప్రత్యేక స్కీమ్ రూపొందించింది సీబీఎస్ఈ. 

 

కరోనా ఎఫెక్ట్ సీబీఎస్ఈ విద్యార్థులపై పడింది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో.. జులై ఒకటి నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షల్ని నిర్వహించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు.. పరీక్షలు రాసే పరిస్థితి లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కొందరు పేరెంట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో నిర్వహించిన పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా ఫలితాలు విడుదల చేయాలని.. తల్లిదండ్రులు పిటిషన్ లో కోరారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా.. సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయించింది. అయితే ఫలితాల వెల్లడికి.. సీబీఎస్‌ఈ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. జులై 15నాటికి ఫలితాలు వెల్లడించనున్నారు. 

 

పరీక్షలు రాయకపోయినా ఫలితాలు వెల్లడించేందుకు.. CBSE ప్రత్యేక అసెస్ మెంట్ స్కీమ్‌ను అమలు చేయనుంది. దీని ప్రకారం మార్కులు ఇచ్చే పద్ధతి.. విద్యార్థికి, విద్యార్థికి మధ్య తేడా ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో అల్లర్ల కారణంగా.. చాలా మంది విద్యార్థులు కొన్ని పరీక్షలు రాయలేకపోయారు. ఆ తర్వాత కరోనా ఉధృతి, లాక్ డౌన్ కారణంగా.. దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు జరగలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రత్యేక అసెస్ మెంట్ స్కీమ్ ను అమలు చేయనున్నారు. దీని ప్రకారం.. 10, 12 తరగతి పరీక్షలు అన్నీ రాసిన విద్యార్థులకు.. వారి పర్ఫామెన్స్ ఆధారంగా ఫలితాలు విడుదల చేస్తారు. మూడు సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ రాసిన విద్యార్థుల కోసం.. మార్కులు ఎక్కువ వచ్చిన మూడు పరీక్షల సగటుతో ఫలితాలు ఉంటాయి.

 

ఇక కేవలం మూడు పరీక్షలు మాత్రమే రాసిన విద్యార్థులకు.. అత్యధిక మార్కులు వచ్చిన రెండు పరీక్షల సగటును పరిగణలోకి తీసుకుంటారు. ఇక కేవలం ఒకటి లేదా రెండు పరీక్షలు మాత్రమే రాసినవారికి.. వాళ్ల ప్రాక్టికల్, క్లాస్ ప్రాజెక్ట్స్ ఆధారంగా రిజల్ట్స్ వస్తాయి. అయితే పరీక్షలు రాయకుండా వచ్చిన ఈ రిజల్ట్స్ తో సంతృప్తి చెందని 12వ తరగతి విద్యార్థులకు.. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ పరీక్షలు రాసే ఆప్షన్ ఉంటుంది. జులై 15 నాటికి ఫలితాలు వెల్లడిస్తామని, పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబరులో పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ.. సుప్రీంకోర్టుకు తెలిపింది.


 
ఆప్షనల్‌ పరీక్షలు రాయాలా? వద్దా? నిర్ణయించుకునే అధికారం విద్యార్థులదే. అసెస్‌మెంట్‌ ఫలితాల కంటే ఎక్కువ మార్కులు వస్తాయనుకుంటే.. పరీక్షలు రాసేందుకు సిద్ధం కావొచ్చు. అయితే 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఈ అవకాశం ఉండదు. వాళ్లకు సీబీఎస్ఈ విడుదల చేసే ఫలితాలే ఫైనల్. 

 

ఐసీఎస్‌ఈ ఫలితాలకు కూడా ఇదే పద్ధతిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.  అసెస్‌మెంట్‌లో సీబీఎస్‌ఈతో పోలిస్తే కొంత తేడా ఉంటుందని ఐసీఎస్‌ఈ తెలిపింది. స్వల్ప మార్పులతో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించింది. నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఐసీఎస్‌ఈకి సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: