ఇటీవల గల్వాన్‌ వ్యాలీలో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ, మ‌న సైనికుల మ‌ర‌ణం ప్ర‌పంచ‌‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన సంగ‌తి తెలి‌సిందే. పొరుగు దేశ‌మైన చైనా తీరు గురించి ప‌లువురు భ‌గ్గుమంటున్నారు. అయితే, ఇప్ప‌టికే దీనిపై రాజ‌కీయ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. దేశంలోని కొన్ని పార్టీలు ప్ర‌ధాన‌మంత్రి న‌‌రేంద్ర మోదీపై, బీజేపీ స‌ర్కారుపై మండిప‌డుతున్నాయి. అయితే, తాజాగా బీజేపీ ఒక‌నాటి మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన మాత్రం మ‌రిన్ని సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేసింది. రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ.. లఢాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ నాటకం ఆడుతున్నదని శివసేన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

 

శివసేన తమ అధికార పత్రిక సామ్నాలో సంచ‌ల‌న‌ సంపాదకీయం రాసింది. భారత సైనికుల త్యాగాన్ని ఉపయోగించుకొని బీహార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందాలని నరేంద్ర మోదీ యోచిస్తున్నారని తీవ్రమైన ఆరపణలు చేసింది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 'కుల, ప్రాంతీయ కార్డు' రాజకీయాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. గ‌ల్వాన్ ఘ‌ట‌న అనంతరం "ఈ రోజు, నేను బీహార్ ప్రజలతో మాట్లాడుతున్నాను, ప్రతి బిహారీ చైనా సైన్యంతో పోరాడుతున్న వారి శౌర్యం గురించి గర్వపడుతున్నారు. నేను బిహారి రెజిమెంట్‌ అమరులకు నివాళులు అర్పిస్తున్నాను." అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సామ్నా త‌ప్పుప‌ట్టింది. “ప్రధాని మోదీ అటువంటి రాజకీయాల్లో నిపుణుడు. గల్వాన్‌ వ్యాలీలోని 'బీహార్ రెజిమెంట్' యొక్క శౌర్యాన్ని ఆయన ప్రశంసించారు. అంతకుముందు, దేశం సరిహద్దుల్లో ముప్పును ఎదుర్కొన్నప్పుడు మహర్, మరాఠా, రాజ్‌పుత్, సిక్కు, గూర్ఖా, డోగ్రా రెజిమెంట్లు పనిలేకుండా కూర్చున్నాయా? రాబోయే బీహార్ ఎన్నికల కారణంగా భారత సైన్యంలో కులం, ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు ఒక వ్యాధి వంటివి. ఇది కరోనా వైరస్ కంటే తీవ్రమైనది” అని వ్యాఖ్యానించింది.

 

ఇదిలాఉండ‌గా, ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో ప్ర‌స్తుతం ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన సైనిక ఘ‌ర్ష‌ణ ఘ‌ట‌న త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింది.  ఈ నేప‌థ్యంలో భార‌త వైమానిక ద‌ళానికి చెందిన యుద్ధ హెలికాప్ట‌ర్లు, విమానాలు గ‌స్తీ నిర్వ‌హిస్తున్నాయి.  లేహ్‌లో సైనిక హెలికాప్ట‌ర్లు నిఘా పెడుతూ .. సార్టీలు నిర్వ‌హిస్తున్నాయి. చైనాతో వాస్త‌వాధీన రేఖ వెంట ప్ర‌స్తుతం ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉన్న నేప‌థ్యంలో భార‌త వైమానిక ద‌ళం త‌న గ‌స్తీని పెంచింది. ఇవాళ ఉద‌యం చినూక్ హెలికాప్ట‌ర్లు ప‌హారా కాశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: