ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప అన్న సంగతి తెలిసిందే. అంటే రాయలసీమ అన్నమాట. అదేంటో గానీ ఏపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి రాయలసీమ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు పాలించారు. కానీ.. ఇప్పటికీ రాయలసీమ వెనుకబడే ఉంది. కరవు కోరల్లోనే ఉంది. దీనికి ప్రధాన కారణం నీటి సమస్య అన్న సంగతి తెలిసిందే.

 

 

రాయలసీమకు నీరందించేందుకు ఎన్నో ప్రాజెక్టులు ప్రణాళికలు రచించారు. కానీ ఏవీ సరిగ్గా పూర్తి కాలేదు. కానీ.. రాయలసీమకు నీరందించేందుకు గట్టి పట్టుదలతో ఉన్న జగన్.. ఈసారి ఆ దిశగా ఓ ముందుడుగు వేశాడు. రాయలసీమ బిడ్డ అనిపించుకున్నాడు. రాయల సీమలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రత్యేక సంస్థను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది వంద శాతం ప్రభుత్వ నిధులతోనే నడుస్తుంది.

 

 

ఏదో నామ్ కే వాస్తేగా ఏర్పాటు చేయడం కాకుండా దాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో దీనిని రిజిస్టర్ చేయాల్సిందిగా జలవనరులశాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ను సీఎం జగన్ ఆదేశించారు. అంతే కాదు.. ఎస్పీవీ ఏర్పాటుకు జలవనరులశాఖ నుంచి రూ.5 కోట్ల పెట్టుబడి నిధులు మంజూరు చేసేశారు.

 

 

ఈ సంస్థ ఏం చేస్తుందంటే.. 27 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సమీకరిస్తుంది. రాయలసీమ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లను ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ఉన్న అవకాశాలను ఈ సంస్థ గుర్తిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రాయలసీమ నీటి కష్టాలు తీర్చేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ఈ సంస్థ అధ్యయనం చేస్తుంది. ఈ సంస్థ ద్వారానైనా రాయలసీమ నీటి కష్టాలు తీరతాయని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: