ఏడాది పాలన తర్వాత జగన్ సర్కారు దూకుడు పెంచింది.. తెలుగు దేశం నేతలు వరుస అరెస్టులతో గగ్గోలు పెడుతున్నారు. మాజీ మంత్రి అచ్చె‌న్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే వివిధ కేసుల్లో అరెస్టయి పోలీసులు రిమాండ్ లో ఉన్నారు. అంతే కాదు.. ఇప్పటికే ఏపీ సర్కారు ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకలు వంటి అంశాలపై సీబీఐ విచారణకు సిఫారసు చేసింది.

 

 

ఈ నేపథ్యంలో త్వరలోనే నారా లోకేశ్ అరెస్టు కూడా తప్పదంటూ వైసీపీ మంత్రి ఒకరు పరోక్షంగా కామెంట్ చేశారు. నారా లోకేశ్ అరెస్టయిన టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేశ్ లపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు,లోకేష్ లకు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం లేదు గానీ, అవినీతికి పాల్పడిన టీడీపీ గజ దొంగలను మాత్రం పరామర్శించేందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

 

 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేశ్ ఎలా వెళ్లారని వెల్లంపల్లి విమర్శించారు. పేదల కష్టార్జితాన్ని దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారని వెల్లంపల్లి మండిపడ్డారు. అయితే .. అచ్చెన్నాయుడు ఎక్కడ తన పేరు బయటపెడతారేమోనని భయపడే నారా లోకేశ్ వారి కుటుంబ పరామర్శకు వెళ్లారని విమర్శించారు.

 

 

అక్కడితో ఆగకుండా... నారా లోకేశ్ ను కూడా టిడిపి నేతలు త్వరలోనే పరామర్శించే రోజులు వస్తాయని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అంటే త్వరలోనే నారా లోకేశ్ ను కూడా వైసీపీ సర్కారు అరెస్టు చేయిస్తుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే అలా జరిగినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నాయి వైసీపీ వర్గాలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: