కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో పెద్దలకే కాదు స్కూలు పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒక వైపు చదువులు లేక ఇంట్లో ఉండి టీవీలకు, సెల్ ఫోన్లకు అలవాటు పడి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆన్‌లైన్ క్లాసుల పేరిట దోపిడి స్టార్ట్ చేశారు.. ఎనిమిది గంటలు స్కూల్‌కు వెళ్లి చదివితేనే వచ్చే చదువులు అంతంత మాత్రమే.. మరీ 20 నిమిషాల అన్‌లైన్ క్లాస్‌లో చదివే పిల్లలు ఏం వెలగబెడతారో దోచుకుంటున్న స్కూళ్ల యజమానులకే తెలియాలి..

 

 

ఇదిలా ఉండగా ఆన్‌లైన్ క్లాసుల వల్ల టీనేజీలో ఉన్న ఆడపిల్లలు మోసగాళ్ల మాయలో పడుతున్నారని ఈ ఘటన నిరూపిస్తుంది.. అదేమంటే ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాక, పిల్లలు ఆన్‌లైన్‌తోపాటు ఇంటర్నెట్‌కు బాగా దగ్గరయ్యారు. సోషల్‌ మీడియాలో మునిగితేలుతున్నారు. ఇలా సోషల్‌ మీడియాకు బానిససైన మైనర్‌ బాలిక ఒక మాయలోడి మోజులో పడి మోసపోయింది. అయితే చివరి క్షణంలో ఆమె తండ్రి చొరవతో క్షేమంగా బయటపడింది. ఘటనకు సంబంధించి వివరాలు చూస్తే..

 

 

బెంగళూరు ఉత్తరహళ్లిలోని ఏజీఎస్‌ లేఔట్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలిక ఆన్‌లైన్‌ పాఠాలతో ఇంటర్నెట్, సోషల్‌ మీడియాకు బాగా అలవాటు పడింది. అప్పటి నుండి ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత ఫోటోలు కూడా అప్‌లోడ్‌ చేస్తూ ఉండేది. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ అనే యువకుడితో అయిన పరిచయం ప్రేమగా మారగా, ఆ యువకుడు ఈ బాలికకు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌ వచ్చేలా ఒప్పించాడట. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు.. దీంతో బాలిక జూన్‌ 8వ తేదీన మ్యూజిక్‌ క్లాస్‌ వెళ్లుచున్నానని చెప్పి ఇంటి నుండి నేరుగా కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.

 

 

అప్పటికే తన కూతురి ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ తండ్రి ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌‌ డీకోడ్‌ చేసి చాటింగ్‌ హిస్టరీ చూసి విషయం తెలుసుకున్నాడు. అందులో తన కూతురికి విశాల్‌ హైదరాబాద్‌ రావడానికి విమానం టిక్కెట్‌ కూడా బుక్‌ చేసిన సంగతి తెలియగా, వెంటనే ఎయిర్‌‌పోర్టుకు వెళ్లగా కుమార్తె పట్టుబడింది. ఆమెను తీసుకుని ఆ తండ్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపోతే సైబర్‌ క్రైం పోలీసులు, పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్‌ 468 కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.. చూశారా ఎలాంటి మాయగాళ్లు సమాజంలో తయారు అయ్యారో..  

మరింత సమాచారం తెలుసుకోండి: