ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభ‌విస్తున్న శశికళ ఆగస్టు 14న విడుదల కానున్నార‌న్న వార్త దావ‌నంలా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈమేర‌కు బీజేపీకి చెందిన ముఖ్య‌నేత  చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెద్ద చ‌ర్చ‌కే దారితీసింది.  ముఖ్యంగా  అన్నాడీఎంకేలో కలకలం రేపుతోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు 2017 ఫిబ్రవరి 15న బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకెళ్లిన విషయం తెలిసిందే.

 

వాస్త‌వానికి 2017 ఫిబ్రవరిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు జీవితాన్ని ప్రారంభించిన శశికళకు నాలుగేళ్ల శిక్షా కాలం 2021 ఫిబ్రవరితో ముగియాల్సి ఉంది. అయితే  సత్ఫ్రవర్తన కింద  ఆగ‌స్టు 14నే జైలు నుంచి బ‌య‌ట‌కు రానున్న‌ట్లుగా వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇదే విష‌యంపై  శిక్షాఖైదీల్లో శశికళ కూడా ఉన్నారా అనే విషయం స్పష్టం చేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత ఆశీర్వాదం ఆచారి.. సమాచార హక్కు చట్టం కింద బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసుల నుంచి ఇంకా బ‌దులు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే త‌న‌కు విశ్వ‌స‌నీయంగా తెలిసింద‌ని సత్ఫ్రవర్తన కోటా కింద ఆగస్టు 14వ తేదీన శశికళ విడుదల కానున్నారని ఆశీర్వాదం ఆచారి గురువారం ట్వీట్‌ చేసి కలకలాన్ని రేపారు.

 

శశికళను శిక్షాకాలానికి ముందే సత్ప్రవర్తన నిబంధనల కింద బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి ఆమె అక్క కుమారుడు, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ వ‌స్తున్నారు. శ‌శిక‌ళ‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి బీజేపీయే కృషి చేస్తోంద‌న్న‌వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ‌నాడులో బీజేపీ ఎదుగుద‌ల‌కు ఆమెను వినియోగించుకోవాల‌ని క‌మ‌లం అధిష్ఠానం భావిస్తున్న‌ట్లుంద‌న్న అభిప్రాయం రాజ‌కీయ విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. గతంలో శశికళను జైలులో భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి మిత్రురాలు, మాజీ ఐఏఎస్‌ అధికారిణి ఒకరు కలవడం, ప్రస్తుతం ఆశీర్వాదం ఆచారి ట్వీట్‌ చేయడం వంటి పరిణామాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: