ప్రపంచవ్యాప్తంగా కరోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఈ దేశం, ఆ దేశం అనే తేడా లేకుండా...అగ్ర‌రాజ్యం అమెరికా నుంచి మొద‌లుకొని ఆఫ్రికా ఖండం వ‌ర‌కూ అన్ని దేశాలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 1,93,781 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,03,986కి చేరింది. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మొత్తం 4,96,845 మంది మరణించారు. శుక్ర‌వారం ఒక్కరోజే 5062 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా మెరుగు ప‌డుతోం‌ది. రోజురోజుకు వైర‌స్ బారిన‌పడుతున్న వారి సంఖ్య కంటే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో రిక‌వ‌రీ రేటు పెరుగుతోంది.

 

అమెరికాలో కరోనా ఉధృతి మరింత పెరిగింది. తాజాగా దేశంలో 45,256 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,52,956కు చేరింది. ఈ వైరస్‌తో నిన్న 600 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,27,640కి పెరిగింది. దేశంలో 10,68,703 మంది కరోనా బాధితులు కోలుకోగా, 13,56,613 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కరోనా కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో కరోనా జోరు కొనసాగుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,80,054కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 56,109 మంది మరణించారు. శుక్రవారం ఒక్కరోజే దేశంలో కొత్తగా 46,907 కేసులు నమోదవగా, 1055 మంది మరణించారు. రష్యాలో నిన్న కొత్తగా 6800 కరోనా కేసులు రాగా, కొత్తగా 176 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,20,794కు చేరగా, 8,781 మంది చనిపోయారు.

 

భారత్‌లో ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవడుతున్నాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగుతోంది. దేశంలో ఇప్పటివరకు 5,09,446 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో 15,689 మంది మరణించారు. రోజువారీ కొత్త కేసులల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండగా, మొత్తంగా కేసులు, మరణాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. మ‌రోవైపు, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 58 శాతాన్ని దాటింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 5 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, దాదాపు 3 ల‌క్ష‌ల మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకున్నార‌ని ఆయ‌న చెప్పారు. కాగా, దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల‌లో 85 శాతం కేసులు కేవ‌లం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెల్ల‌డించారు. మ‌ర‌ణాలు కూడా ఆ 8 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోనే 87 శాతం ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు. ఇక దేశంలోని మొత్తం కేసుల‌లో మ‌ర‌ణాల రేటు 3 శాతంగా ఉన్న‌ద‌ని, కేసుల డ‌బులింగ్ వ్య‌వ‌ధి 19 రోజుల‌కు పెరిగింద‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: