కరోనా బారిన పడ్డ ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోవడం లేదు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. వైరస్‌తో పోరాటం చేసే స్థాయి ఇమ్యూనిటీ ఉన్న వాళ్లు కోవిడ్ నుంచి త్వరగానే కోలుకుంటున్నారు. కానీ కొంతమందికి కరోనా ప్రాణాంతకంగా మారుతోంది. అప్పటికే అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు... రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లను కరోనా పీడిస్తోంది.. చివరకు ప్రాణాలను కూడా హరించి వేస్తోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కరోనా ఎప్పుడు పడితే అప్పుడు ప్రాణాలు తీయడం లేదు.. దానికి కూడా ఓ లెక్కుంది.. అర్ధరాత్రి వేళల్లో... మరీ ముఖ్యంగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. 

 

వైద్యులు చెబుతున్న మాట ఒక్కటే... నిద్ర పోతున్న సమయంలో ఆక్సిజన్ శాచురేషన్ పడిపోవడం. అవును.. ఆ సమయంలో ఆక్సిజన్ శాచురేషన్ ఉండాల్సినంత స్థాయిలో ఉండకపోవడమే కరోనా బాధితుల పాలిట శాపంగా మారుతోంది.. ఇంతకీ ఆక్సిజన్ శాచురేషన్ అంటే ఏంటి..? అసలు అది ఎందుకు తగ్గుతుంది..? వీటికి సమాధానాలు చెప్పుకోవాలంటే.. మానవ శరీరంలో జరిగే ప్రక్రియను అర్ధం చేసుకోవాలి.

 

ఆక్సిజన్, గ్లూకోజ్ లెవల్స్ సరిగా ఉంటేనే.. శరీరంలో కణాలు, కణజాలాలు బాగా పనిచేస్తాయి. శరీరానికి గ్లూకోజ్ శక్తినిస్తుంది. ఆక్సిజన్ దీనిని రూపాంతరం చెందించి... అన్ని కణాలకు సరఫరా చేస్తుంది. ఎర్ర రక్తకణాల్లో ఉండే.. హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. శరీరంలోని కణాలు, కణజాలాలకు ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ సరఫరా జరగాలంటే.. ఆక్సిజన్ తగిన స్థాయిలో ఉండటం అవసరం. ఊపిరితిత్తుల్లో జరిగే ఆక్సిజనేషన్ ప్రక్రియే దీనికి మూలం. గ్లూకోజ్ శక్తిగా మారి... శరీరాన్ని నడిపించాలంటే... ఆక్సిజన్ చాలా అవసరం. ఆక్సిజన్‌ను సరఫరా చేసే హిమోగ్లోబిన్ స్థాయినే రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్‌గా చెబుతారు. 

 

ఆరోగ్యవంతుల శరీరంలో హిమోగ్లోబిన్ కనీసం 14 శాతం ఉండాలి. ప్రకృతి నుంచి ఊపిరితిత్తులు సరిపడా ఆక్సిజన్‌ను తీసుకున్నా... దానిని కణజాలానికి  సరఫరా చేసే హిమోగ్లోబిన్ సరపడా లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా... దానిని సరఫరా చేసే హిమోగ్లోబిన్ అనే వాహకం సరిపడా లేకపోవడమే దీనికి కారణం. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్లలో ఆక్సిజన్‌ను సరఫరా చేసే స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయంలో కరోనా పేషెంట్ల పరిస్థితి మరికొంత భిన్నంగా ఉంటుంది. వైరస్ నేరుగా ఊపిరి తిత్తులపై ఎటాక్ చేయడం వల్ల... శరీరంలోకి ఆక్సిజన్‌ను తీసుకునే శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో హిమోగ్లోబిన్ సరిపడా ఉన్నా... ఉపయోగం ఉండదు. హిమోగ్లోబిన్ 13 నుంచి 15 గ్రాముల వరకు ఉన్నా... ఊపిరితిత్తుల్లో ఆక్సిజనేషన్ ప్రక్రియ జరగకపోవడం వల్ల సమస్యలు తలెత్తున్నాయి. హిమోగ్లోబిన్ సాధారణ స్థాయిలో ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేస్తే... దానిని వైద్య పరిభాషలో వందశాతం శాచురేషన్ అంటారు.  కరోనా పేషెంట్లలో హిమోగ్లోబిన్ సరిపడా ఉన్నా... వైరస్ లంగ్స్‌ను దెబ్బతీయడంతో ఆక్సిజన్ సరఫరా సరిగా జరగదు.. శాచురేషన్ స్థాయి 92 శాతం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. 90 శాతానికి లోపు ఉంటే.. ఇబ్బందే.! 

 

రాత్రి వేళల్లో నిద్రపోయే సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. సాధారణంగా హార్ట్‌ రేట్ 78 ఉంటే.. నిద్రించే సమయంలో అది తగ్గుతుంది. 20 వరకు ఉండే రెస్పిరేటరీ రేట్ కూడా నిద్రపోయే సమయంలో తగ్గిపోతుంది. ఇది సాధారణంగా జరిగే జీవ ప్రక్రియ. ఇక కరోనా పేషెంట్లలో వైరస్ తీవ్రత కారణంగా అప్పటికే ఆక్సిజన్ రేటు తగ్గిపోయి ఉంటుంది. రాత్రి సమయాల్లో అది మరింత తగ్గుతుంది. ఇక హార్ట్ రేట్‌ , రెస్పిరేటరీ రేట్ కూడా ఇతరుల కంటే చాలా తక్కువగా ఉంటాయి. కరోనా పేషెంట్లు క్రిటికల్ స్థాయికి చేరుకోవడానికి ఇలాంటివే కారణాలు. తక్కువ ఆక్సిజన్ శాచురేషన్ ఉండటం వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తుతాయి. వైద్య పరిభాషలో నైట్ రిథమ్ తగ్గడం వల్ల జరిగే ఈ మార్పులను సింపథిగ్‌ టోన్ అంటారు. అందుకే పగటి వేళల్లో కంటే... రాత్రి సమయాల్లో కరోనా బాధితులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొన్ని ఆస్పత్రుల్లో  కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసే ప్రోటోకాల్స్‌ను మార్చుకున్నాయి. రాత్రి వేళల్లో రోగులకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయడం లాంటి చర్యలు చేపట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: