జగన్ అధికారంలోకి రాగానే...పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేసి, వాటిని గ్రామ సచివాలయాలుగా మార్చి, లక్ష మందికిపైనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ప్రజలకు మరింత మెరుగగా సేవలు అందించాలనే ఉద్దేశంతో జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చారు. ఇక దీని వల్ల ప్రజలకు చాలా అంటే చాలా మేలు జరుగుతుంది.

 

అయితే ఇంత మేలు జరిగే విషయాన్ని వదిలేసి, ప్రతిపక్ష టీడీపీ మాత్రం సచివాలయాలకు వేసిన రంగులపై రాజకీయం చేసింది. ఆ రంగులు వైసీపీవని చెప్పి, కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఇక ప్రజల ఆస్తి అయిన పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేయడం కరెక్ట్ కాదని, వెంటనే వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. పైగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావడంతో, దీనిపై హైకోర్టు మరింత సీరియస్ అయ్యి, తక్షణమే రంగులు తీసేయాలని చెప్పింది. కానీ ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం తగ్గకుండా అనేక రకాలుగా న్యాయ పోరాటం చేసింది.

 

ఈ విషయంలో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. తాజాగా అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే వెంటనే రంగులు మార్చాలని పంచాయతీలకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని.. సీఎం జగన్‌ బొమ్మ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలిచ్చింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొంది.

 

అయితే ఇక్కడ కూడా ఓ చిక్కు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏమో సీఎం బొమ్మ ఉంచాలని చెప్పింది. కానీ సుప్రీం ఆదేశాల ప్రకారం బొమ్మ కూడా ఉండకూడదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం సీఎం బొమ్మ వేయడానికి వీల్లేదని, సీఎం బొమ్మ తీసేయాలని ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారని, అందుకే ఇప్పుడే తీసేస్తే వైసీపీ ప్రభుత్వానికి మంచిదని చెబుతున్నారు. అంటే పరోక్షంగా సీఎం బొమ్మ కూడా తీసి వేయించడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు అర్ధమవుతుంది. ఆ విషయంలో కూడా కోర్టు మెట్లు ఎక్కి జగన్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలనేదే టీడీపీ ప్లాన్‌గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: