ఏపీలో కాపు రాజకీయం మొదలైంది. సీఎం జగన్ కాపు నేస్తం పథకం తీసుకురావడంతో, దీనిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. రాష్ట్రంలో 45 ఏళ్ళు దాటిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకు జగన్ ప్రతి ఏటా రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఏడాది రూ.15 వేలు అందించారు. అయితే రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న కాపుల దృష్టి మరల్చడానికే జగన్ కాపు నేస్తం తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ ఫైర్ అవుతున్నారు.

 

అలాగే కాపు కార్పొరేషన్ పేరిట కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇక పవన్ ఇలా జగన్‌పై విమర్శలు చేయడంతో, అదే కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రి కన్నబాబు తాజాగా మీడియా ముందుకొచ్చి, పవన్‌పై ఫైర్ అయిపోయారు. కాపు నేస్తం పథకంపై పవన్‌ దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు పట్ల ప్రేమను పవన్‌ దాచుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అణచివేశారని, కాపులకు చంద్రబాబు చేసిన మోసాన్ని పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్ అంటే నచ్చడు కాబట్టి... పవన్ విమర్శిస్తున్నారని కన్నబాబు వ్యాఖ్యానించారు.

 

అయితే కన్నబాబు ఈ విధంగా పవన్ మీద విమర్శలు చేయడంతో, గోదావరి జిల్లాలకు చెందిన పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు లైన్‌లోకి వచ్చి కన్నబాబుకు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే 2019 ఎన్నికల్లోనే కలిసి పోటీ చేసేవారని, కానీ పవన్ అలా చేయలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే వైసీపీకి అన్నీ సీట్లు వచ్చేవి కాదని అంటున్నారు. టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే, కనీసం 60 సీట్లు వరకు వచ్చేవని, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీకి చుక్కలు కనిపించేవని చెబుతున్నారు.

 

అసలు టీడీపీతో కలిసి ఉంటే కన్నబాబే గెలిచేవారు కాదని, కాకినాడ రూరల్‌లో కన్నబాబు, టీడీపీ అభ్యర్ధి అనంతలక్ష్మిపై కేవలం 9 వేల మెజారిటీతో గెలిచారని గుర్తుచేస్తున్నారు. అయితే కన్నబాబుకు 74 వేల ఓట్లు వస్తే, అనంతలక్ష్మికి 65 వేలు వచ్చాయని, అలాగే జనసేన అభ్యర్ధి పట్నం వెంకటేశ్వరరావుకు 40 వేల ఓట్లు వచ్చాయని, ఇక దీని బట్టి చూసుకుంటే కన్నబాబు పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ పవన్ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఉంటే కన్నబాబుకు విజయం దక్కేది కాదని జనసేన కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: